Sat 18 Apr 00:37:00.612631 2015
Mon January 19, 2015 06:51:29 pm
ఉత్తేజానిచ్చిన సాంస్కృతిక కార్యక్రమాలు
విశాఖపట్నం : వైజాగ్ ఫెస్ట్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక సంబరాల్లో యువకళాకారులు కిర్రాకు పుట్టించారు. సభికులు కేరింతలు, హర్షధ్వానాలతో ప్రాంగణం హోరెత్తింది. అల్లురామలింగయ్య ప్రాంగణంలో గురువారం సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు వారంరోజులకు భిన్నంగా కొనసాగాయి. జానపద, శాస్త్రీయ నృత్యాలతో పాటు యువతీ యువకులు బ్రేక్ డ్యాన్సులతో అదరగొట్టారు. తెలుగుతో పాటు హిందీ, బెంగాలి పాటలతో ఆకట్టుకున్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు సైతం తామేమీ తీసిపోమన్నట్లుగా పలు సమకాలీన గేయాలకు మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన గ్రూప్ డ్యాన్స్ అదిరిపోయింది. తొలుత కళకళలాడే భారతదేశం అంటూ దేశ ఘనకీర్తిని చాటిచెప్పే సినీపాటకు ఆ కళాకారులంతా మెలికలు తిరుగుతూ డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ను గుర్తుకు తెచ్చారు. విజయనగరం జిల్లా రఘు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఉమాగాయత్రి, స్రవంతి, అంజలి బృందంగా ఓ హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల మన్ననలు, ప్రశంసలు పొందారు. బెంగాల్‌కు చెందిన కళాకారుల బృందం మ్యూజిక్, గేయంతో సభికుల మనసు దోచుకుంది. శ్రీకృష్ణ విద్యాలయానికి చెందిన 14 మంది కళాకారులు 'బుజ్జిబుజ్జి' గేయానికి వడివడిగా అడుగులేస్తూ.. చివరకు తమ నృత్యంతో రక్తికట్టించారు. కమ్యూనిస్టులవసరం.. మార్క్సిజం అవసరం.. అనే గేయాన్ని ఆలపించిన వాసు, సుజాత, వారి ఇద్దరు పిల్లలను ప్రముఖ రచయిత అశోక్ తేజ ఎంతో మెచ్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, వేణుగోపాల్ కలిసి నంది అవార్డు గ్రహీత కెకెఎల్ స్వామిని ఘనంగా సన్మానించారు. ఈ ఫెస్ట్ తనకెంతో అనుభూతినిచ్చిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు నీలోత్పర్బసు అన్నారు. సిమ్లా డిప్యూటీ మేయర్ సింగ్, వ్యవసాయ సంఘం ఆలిండియా కార్యదర్శి, ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.