Wed 15 Apr 11:25:10.94161 2015
Mon January 19, 2015 06:51:29 pm
రక్తికట్టించిన నాటకోత్సవాలు
విశాఖపట్నం : వైజాగ్ ఫెస్ట్ లో భాగంగా మంగళవారం నిర్వహించిన వీధి నాటకోత్సవాలు ప్రజాజీవితాన్ని ప్రతిబింబించాయి. సమాజంలో నాటికీ నేటికీ ఉన్నతేడా నుంచి తెలియజేసిన నటన నవ్వులు పండించింది. కళాకారులు ఓ వైపు సమాజాన్ని లోతుగా ఆలోచింపజేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించారు. విశాఖకు చెందిన కళాకారులు మిషన్ అనే నాటకం కార్మికవర్గం దోపిడీకి, అణిచివేతకు గురౌతున్న తీరుకు అద్దం పట్టింది. రెండో భాగంలో కార్మికుల తిరుగుబాటు, హక్కుల సాధన కోసం యజమానులను ఎదురించిన తీరు నేడు పారిశ్రామిక ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటాలను గుర్తుకు తెచ్చింది. అన్యాయంతో బతికేకన్నా పోరాడి హక్కులు సాధించుకోవడమే మేలన్న నినాదం ఆచరణలో ఎలా సాధ్యమనేది కళాకారులు తమ నటన ద్వారా చూపించారు. కృష్ణా జిల్లాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన భార్య, భర్త ఇంకో అది అనే నాటకం పలు ఘట్టాలు ప్రేక్షకులను నవ్వుల రసానందంతో ముంచెత్తాయి. నేటి ఆధునిక సమాజంలో మానవీయ విలువలను వెతుక్కుంటున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. ఓ ఇల్లాలు టివి సీరియల్స్ మోజులో పడి తన కుటుంబాన్ని ఎలా కోల్పోయిందో నటనలో చక్కగా చూపించారు. కార్పొరేట్ కంపెనీల మోసపూరిత ప్రకటనలకు లోనైన జనం అనివార్యంగా వినిమయ సంస్కృతి ఆచరిస్తున్న తీరును చక్కటి హావభావాలతో విడమర్చారు. అనంతరం చిత్తూరు జిల్లాకు చెందిన 15 మంది కళాకారులు మోడ్రన్ మాయాజాలం, గుంటూరు జిల్లాకు చెందిన 15 మంది కళాకారులు రాజాధాని రగడ, నెల్లూరుకు చెందిన కళాకారులు ఏ కులం నీది అనే వీధినాటికలను ప్రదర్శించారు.