Tue 14 Apr 18:35:39.205667 2015
Mon January 19, 2015 06:51:29 pm
80 శాతం వరకు ప్రాంగణంలో వారే...
విశాఖపట్నం : దేశ భవిష్యత్‌కు దిశానిర్దేశం చేయాలన్నా.. తుప్పుబట్టిన సమాజాన్ని మార్చే శక్తులు రావాలన్నా.. యువత చేతుల్లోనే ఉందని ఎన్నో ప్రసంగాలు, మరెన్నో సూక్తులు అనునిత్యం వింటూనే ఉంటాం. ప్రభుత్వాలే యువత పెడదోవపడుతోందని చేసిన ప్రకటనలు కోకొల్లలు. అయితే వైజాగ్ ఫెస్ట్ లో మాత్రం వీటన్నింటికీ సమాధానంగా తరలివస్తున్న యువత తమలోని నైపుణ్యాన్ని, చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తిని, జిజ్ఞాసను తెలియజేస్తున్నారు. ఇక్కడ కొలువుదీరిన ప్రతి వేదికనూ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చరిత్ర, మానవ పరిణామ క్రమాన్ని, పోరాటయోధుల త్యాగాలను, సంస్కృతి సంప్రదాయాలను, సైన్సులోని మార్పులను, శాస్త్రీయతను, వ్యంగ్యచిత్రాల్లో ఉన్న రాజకీయ నాయకుల మోసాలను, అధ్యయనం పెంచే పుస్తకాలను.. ఇలా ఫెస్ట్ లో ఏర్పాటు చేసిన ప్రతి ప్రాంగణాన్ని సందర్శిస్తున్నారు. గురజాడ సాహితీ వేదికలో పాల్గొని సాహిత్యంపై మక్కువ పెంచుకుంటున్నారు. మంగళవారంతో ఐదోరోజుకు చేరిన ఫెస్ట్ ప్రాంతాన్ని ఇప్పటికే వేలాది మంది వీక్షిస్తున్నారు. ముఖ్యంగా సందర్శకుల్లో చిన్నారుల నుంచి 30 ఏళ్లలోపు యువతీ యువకులే దాదాపు 80 శాతం వరకు తిలకించేందుకు వస్తున్నారని, దీన్నిబట్టి యువతలో ఆసక్తి ఎంతగా ఉందో అర్థమవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. మంగళవారం రోజు కూడా సైన్స్ ఫెయిర్ ప్రాంగణం యువతతో పూర్తిగా నిండిపోయింది. బయట నుంచి క్యూ కట్టి మరీ సైన్స్ పరికరాలను తిలకించారు. ఉత్తరాంధ్ర విశిష్టతను, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను తెలిపేందుకు నిర్వహిస్తున్న వైజాగ్ ఫెస్ట్-2015లో యువతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.