Thu 16 Apr 01:37:03.202465 2015
Mon January 19, 2015 06:51:29 pm
విశాఖపట్నం : ఉత్తరాంధ్ర తీరాన తెలంగాణ కళాకారులు తమ కళలతో అలరిస్తున్నారు. ప్రేక్షకుల ప్రశంసలు పొందుతూ నూతనోత్సాహంతో వేదికపై ఉర్రూతలూగిస్తున్నారు. వైజాగ్ ఫెస్ట్ లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లా కళాకారులు తెలంగాణ కళల విశిష్టతను, వాటి ప్రాధాన్యతను కళ్లకు కట్టినట్లు చూపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా కళాకారులు ప్రదర్శించిన వీర తెలంగాణ నాటిక ఉద్వేగం కలిగించి, చివరకు ఉత్సాహాన్ని నింపింది. 45 నిమిషాల పాటు వేదికపై ప్రదర్శించిన ఈ నాటిక ప్రేక్షకులను రక్తికట్టించింది. నైజాం నియంతృత్వ పాలన, మహిళలపై శారీరక హింసలకు పాల్పడిన ఘట్టం ప్రేక్షకులను, సభికులను ఉద్వేగాన్ని కలిగించింది. దున్నేవారిదే భూమి అనే నినాదంతో నైజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కొమురయ్యతో పాటు వేలాదిమంది అమరులైన తీరును అద్భుతంగా చూపించారు. బండెనక బండికట్టి.. ఏబండికొస్తావ్ కొడుకో.. ఎమ్మెల్యే సర్కరోడా... అంటూ నైజాం నవాబును తుపాకులతో చుట్టుముట్టి కాల్చిచంపినప్పుడు రైతులు, వ్యవసాయ కార్మికుల కళ్లల్లో కనిపించిన ఉత్సాహాన్ని కళాకారులు చక్కని హావభావాలతో వ్యక్తపరిచారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, త్రిపుర మంత్రి, ఇతర నాయకులతో పాటు వైజాగ్ ప్రసాద్, సినీ హీరో మాదాలను సైతం ఈ నాటిక కట్టిపడేసింది. అంతకు ముందు రైతు నాటిక ద్వారా కళాకారులు ఓ రైతుపడే కష్టాలను తమ నటనతో తెలియజేశారు.