Sat 18 Apr 21:02:59.983567 2015
Mon January 19, 2015 06:51:29 pm
ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న
విశాఖపట్నం : 'ఇంటర్నెట్, సెల్ఫోన్లు, షేర్ మార్కెట్లు విస్తరించిన తరుణంలోనూ పుస్తక ప్రదర్శనకు ప్రజలు ఇంత ఆదరణ చూపుతున్నారంటే ఇంకా నాగరికత బతికే ఉంది. పుస్తకానికి ఆదరణ తగ్గిన రోజున నాగరికత పోయి అనాగరికంలో ఉన్నట్లే' అని జానపద కళాకారుడు, ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అన్నారు. ప్రాంతీయ మాండలికం నుంచి వచ్చిన జానపదం భాష బతికున్నంత కాలం ఉంటుందని, దీన్ని అంతం చేయడం ఎవరితరం కాదని ఆయన పేర్కొన్నారు. ఎయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వైజాగ్ ఫెస్ట్ ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గురజాడ సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రలో కవులు, రచయితలు, సాహితీవేత్తలు ఎంతో మంది ఉన్నారన్నారు. కళాకారులకు, రచయితలు అభ్యుదయవాదులకు గురజాడే అడుగు జాడ అన్నారు. ఈ ఫెస్ట్ ద్వారా చాలామంది తమ విజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటున్నారని చెప్పారు. వ్యాపారం చొరబడని ప్రాంతాల్లో సాహిత్యం బతికే ఉందన్నారు. సమావేశంలో బుక్ ఫెస్ట్ ఇన్‌ఛార్జి లక్ష్మయ్య, తెలంగాణ ప్రజా సాంస్కృతిక వేదిక రాష్ట్ర నాయకులు అజయ్‌బాబు పాల్గొన్నారు.