Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకునేందుకు కేంద్రం సైనిక చర్య
- ఎర్రజెండా పోరుకు అప్పటికే చేతులెత్తేసిన నిజాం సర్కార్
- సైనిక చర్య జరిగినా తెలంగాణను వదలని సైనికులు
- కమ్యూనిస్టులపై కొనసాగిన నిర్బంధాలు
- రైతాంగ సాయిధ పోరాటంతోనే వెట్టికి విముక్తి
- సాయుధ పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఎక్కడ
- కమ్యూనిస్టులే సాయుధ పోరాట వారసులు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట బైక్ ర్యాలీ
- పోల్కంపల్లిలో బహిరంగ సభ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వెట్టి చాకిరిలో మగ్గుతున్న తెలంగాణ ప్రాంతంలోని సంస్థానాలు ఒక్కొక్కటిగా కమ్యూనిస్టులు కైవసం చేసుకుంటున్నరన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నాడు సైనిక చర్యకు పూనుకున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. అప్పటికే మెజార్టీ సంస్థానాలు కమ్యూనిస్టుల చేతుల్లోకి వచ్చాయని చెప్పారు. ఇక హైదరాబాద్ సంస్థానం కూడా కమ్యూనిస్టుల చేతుల్లోకి పోతే తమకు భవిష్యత్తు ఉండబోదని గ్రహించిన నాటి పాలకవర్గం సైనిక చర్యకు పూనుకున్నదన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాల్లో భాగంగా సీపీఐ(ఎం) చేపట్టిన బైక్ ర్యాలీ ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి చేరుకుంది. ఈ సందర్భంగా పోల్కంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్‌తో కలిసి పాల్గొన్న జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులకే సొంతమన్నారు. నాటి పాలకవర్గంతో పాటు నైజాం నవాబులు, రజాకారులు సాగిస్తున్న అరాచకాలకు ఎదురొడ్డి నిలబడిన రైతులు, సాధారణ ప్రజలతో కమ్యూనిస్టులు మమేకమై ఉద్యమాలు కొనసాగించారన్నారు. ఈ పోరాటంలో 4000 మంది బలిదానం చేశారన్నారు. కమ్యూనిస్టుల పోరాటం చరిత్రలో నిలుస్తుందన్నారు. దున్నేవానికి భూమి కావాలని, వెట్టిచాకిరి నుంచి విముక్తి జరగాలని మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రధాన డిమాండ్‌తో ఆ పోరాటం ఉధృతంగా సాగిందన్నారు. ఆడ, మగ తేడా లేకుండా సాధారణ ప్రజల సైతం కుల, మత తారతమ్యాలు లేకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య మొదలుకొని ఈ ప్రాంతంలో కృష్ణమూర్తి, పోచమోని జంగయ్య, అడివయ్య, బర్ల శివయ్య వంటి మహామహానాయకులు నాయకత్వం వహించారన్నారు. నల్లగొండ జిల్లా ఉద్యమాన్ని కేంద్రంగా చేసుకొని రంగారెడ్డి జిల్లాపై అరాచక శక్తుల మెడలు ఉంచింది ఎర్రజెండ మాత్రమేనన్నారు. కానీ ఈ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని నేటి రాజకీయ పార్టీలు తన రాజకీయ పబం గడుపుకునేందుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దొడ్డి కొమరయ్య బలిదానంతో ఈ ఉద్యమం మరింత ఉధృతంగా సాగిందన్నారు. ప్రజల నుంచి నైజాంపై వ్యతిరేకత మరింత పెరిగిందన్నారు. చేసేది లేక భూస్వాములు, పెత్తందారులు గ్రామాలు వదలి పారిపోయారన్నారు. ఇన్నాళ్లు వారి చెరలో మగ్గిన 10వేల ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టులకే దక్కిందన్నారు. అంతే కాకుండా మూడువేల గ్రామాలను అష్టగతం చేసుకొని గ్రామ రాజ్యాలను స్థాపించి ప్రజలకు సుపరిపాలన అందించారని గుర్తు చేశారు. ఇక మిగిలిన హైదరాబాద్ సంస్థానాన్ని కూడా మరి కొద్ది రోజుల్లో కమ్యూనిస్టులు కైవాసం చేసుకుంటారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్రం దిగివచ్చిందన్నారు. అప్పటికే నైజాం సర్కారు తోకముడిచిందని చెప్పారు. తెలంగాణలో కమ్యూనిస్టులను ఎదుర్కొనే సత్తా నైజాంకు లేకపోవడం వల్ల చేతులెత్తి కేంద్రానికి లొంగిపోయాడన్నారు. ఈ త్వరలో హైదరాబాద్ సంస్థానం కూడా ఎర్రజెండా నాయకత్వంలోకి పోతే తెలంగాణ ప్రాంతంలో తమకు స్థానం ఉండబోతున్న ఉద్దేశంతోనే కేంద్రం సైనిక బలగాలను కేంద్రానికి పంపించిందని తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలోనే కేంద్రానికి నైజాం సర్కారు లొంగిపోయాడన్నారు.తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17న విముక్తి లభించిందని వివరించారు. కానీ నేడు బీజేపీ కూస్తున్న కుయుక్తులు తెలంగాణకు తామే వారసులమన్న రీతిలో చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాస్తవాలు కనుమరుగు చేసేందుకు పాలక పక్షాలు జిత్తులు, వారి ఎత్తుగడలు వేస్తున్నాయన్నారు. వీటిని తిట్టుకొట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ఇతర పక్షాలు చెందిన ఎంతమంది నాయకులు అమరులయ్యారని ప్రశ్నించారు. ఎంతమంది జైల్లో భాగ్యారని ప్రశ్నించారు. కానీ కమ్యూనిస్టులు తన ప్రాణ త్యాగం చేయడమే కాకుండా జైలు జీవితాలను గడిపారని అనంతర కాలం కూడా ప్రజాసేవలోనే తుది శ్వాస వరకు నిలిచారని గుర్తు చేశారు. బీజేపీ విషప్రచారాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, జిల్లా కమిటీ సభ్యులు కె.జగన్, మండల కార్యదర్శి జంగయ్య, మండల నాయకులు వెంకటేష్, నర్సింహ, బుగ్గరాములు, యాదగిరి, తదితరలున్నారు.