Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కప్ 2023 పేరిట పోటీలు
నవతెలంగాణ-ఆమనగల్
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు కనుమరుగవుతున్న వేళ నేటి నుంచి అన్ని మండల కేంద్రాల్లో క్రీడా సంబురాలు ప్రారంభం కానున్నాయి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ 2023 పేరిట క్రీడా పండుగకు శ్రీకారం చుట్టారు. పోటీల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇటీవల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవంలో క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధిత ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం పోటీల నోటిఫికేషన్ ప్రకారం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు సజావుగా సాగేందుకు కమిటీలను వేశారు. 15 నుంచి 36 సంవత్సరాల వయసు కలిగిన వారు క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు. మండల స్థాయిలో జరిగే పోటీలకు ఎంపీపీ చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. జడ్పీటీసీ, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ, ఎస్ఐ, మున్సిపల్ కమిషనర్, పిఈటిలు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఐదు క్రీడాంశాలలో పురుషులు మహిళలకు అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఇదేవిధంగా జిల్లాస్థాయిలో వివిధ క్రీడాంశాలలో పురుషులు మహిళలకు అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, హ్యాండ్ బాల్, సిమ్మింగ్తో పాటు ఫుట్‌బాల్, బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు ఈనెల 22 నుంచి 24 వరకు జరగనున్నాయి. మండల స్థాయిలో నిర్వహించిన విధంగానే, జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహిస్తారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో, అక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతి ఇస్తారు. వ్యక్తిగత విభాగంలో మొదటి స్థానానికి రూ.20 వేలు, ద్వితీయ స్థానానికి రూ.15 వేలు, తతీయ స్థానానికి రూ.10 వేలు ఇస్తారు. టీం విభాగంలో మొదటి స్థానానికి లక్ష రూపాయలు, ద్వితీయ స్థానానికి రూ.75 వేలు, తృతీయ స్థానానికి రూ.50 వేలు ఇవ్వనున్నారు.
క్రీడాకారులకు వరం సీఎం కప్ పోటీలు
గ్రామీణ క్రీడాకారులను ఉత్సాహపర్చడంతో పాటు వారి ప్రతిభను వెలికితీయదానికి ప్రభుత్వం సీఎం కప్పు నిర్వహిస్తుంది. ఈ అవకాశాన్ని క్రీడాకారులు వినియోగించుకోవాలి. దీంతో గ్రామాల్లో క్రీడా సందడి కనిపిస్తుంది. మండల, జిల్లా స్థాయిలో రాణించిన వారికి రాష్ట్రస్థాయిలో బహుమతులు అందజేసి జ్ఞాపికలు అందజేస్తారు.
జర్పుల దశరథ్ నాయక్, జడ్పీటీసీ సభ్యులు