Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇల్లు ధ్వంసం
- తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం అయిన సంఘటన బుధవారం మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన రవి రంజన్ కుమార్ కుటుంబం బతుకు తెరువు కోసం 6 నెలల క్రితం దుర్గానగర్ ప్రాంతానికి వలస వచ్చాడు. అతనికి భార్య, ఆరు నెలల కూతురు ఉంది. అయితే బుధవారం ఉదయం బుక్ చేసిన తర్వాత వచ్చిన హెచ్.పీ గ్యాస్ సిలిండర్ను తీసుకొని భార్య అస్మతి కుమారి వంట చేస్తుండగా సిలిండర్ నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే బయటకి పరిగెత్తుకుంటూ వచ్చింది. కొద్ది క్షణాల్లోనే భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. ఆ పేలుడు దాటికి ఇంట్లో నీ వస్తువులు, గోడలు, తలపులు, కిటికీలు అన్ని పూర్తిగా ధ్వంసం అయ్యాయి. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు బాంబు బ్లాస్ట్ అయిందని భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటి తర్వాత అంతా తేరుకొని వెళ్లి చూడగా ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. సిలిండర్ కు మంటలు వ్యాపించిన వెంటనే ఇంట్లోని వ్యక్తులందరూ బయటికి రావడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.