Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లోనిగూడ కల్వర్ట్ వద్ద వాగులో పడ్డ వ్యక్తి మృతి
నవతెలంగాణ-శంషాబాద్
అధికారుల నిర్లక్ష్యానికి వ్యక్తి బలైపోయాడు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండల పరిధిలోని మద్దూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్ సింగ్ తండాకు చెందిన కొడవత్ దేవ్జా (45) నిన్న రాత్రి ఇంటి నుంచి బయలుదేరి మక్తగూడ మీదుగా మదనపల్లి తండాకు వెళ్లడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. శంషాబాద్ మండల పరిధిలోని పిల్లోనిగూడ గ్రామ పరిధిలోని ఎంటేరు వాగు బ్రిడ్జి దాటుతుండగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంతో పాటు వాగులో పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలు అయిన అతను నీటిలోనే మునిగి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదకరంగా మారిన వంతెన
రాయన్నగూడ నుంచి మక్తగూడ వయా పిల్లోనిగూడ మీదుగా పాలమాకుల నేషనల్ హైవే వరకు 33 ఫీట్ల రహదారి నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లోని గూడ గ్రామం వద్ద వాగుపై వంతెన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం అసంపూర్తిగా ఉండటం తోటి అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. వంతెన పైన పెద్ద గుంతలు, తేలిన బండ రాళ్లు, కోతకు గురైన ప్రదేశాలు ఉండడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు వెళ్లడానికి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. వాగు పారినప్పుడు రోడ్డు కొట్టుకుపోవడం వల్ల ఇలా జరుగుతుందని స్థానికులు చెప్తున్నారు. అయితే వర్షాలు తగ్గి వాగు ఉదృతి తగ్గితే వాహనాలు వెళ్లడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిండు ప్రాణం బలైందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మక్త గూడ నుంచి పీల్లోని గూడ మీదుగా నేషనల్ హైవే 44 చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉండటంతో కష్టమైనా ప్రజలు ఈ మార్గం గుండా వెళ్లడానికి సాహాసిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు కల్వర్టుపై ఉన్న రాళ్లు గుంతలను సరి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితులు సంభవించేవి కావని తెలుస్తుంది. అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు పోతున్నాయని ఇప్పటికైనా వెంటనే మరమ్మత్తులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వెంటనే పనులు పూర్తి చేయాలి : కర్రే బుచ్చమ్మ సర్పంచ్ పిల్లోనిగూడ
బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉందని చాలాసార్లు హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకొని తాత్కాలిక మరమ్మతులతో పాటు బ్రిడ్జి పనులు చేపట్టి నిర్మాణం పూర్తి చేయాలి. లేకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.