Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు
- వృత్తివిద్య, నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి
- స్వర్ణభారత్ ట్రస్ట్ - కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం
నవతెలంగాణ-శంషాబాద్
విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో భవిష్యత్ ను నిర్మించుకోవాలని, సమాజ సేవ దిశగా తమను తాము అంకింతం చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ సహకారంతో స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్లో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ లో పలు విభాగాల్లో వత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి శిక్షణను విజయవంతగా పూర్తి చేసుకున్న వారికి దృవపత్రాలను ప్రదానం చేశారు. సేవలోని సంతృప్తిని ఆస్వాదించని జీవితం పరిపూర్ణం కాలేదని అలాంటి జీవితం రుచి లేని ఆహారంలాగా సువాసన లేని పువ్వుల్లా నిరర్ధకంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. వృత్తి విద్యా కోర్సులను అభ్యసించటం వల్ల వృత్తి నైపుణ్యాభివృద్ధితో యువతకు నూతన ఉపాధి మార్గాలకు ద్వారాలు తెలరుచుకుంటాయన్నారు. దేశ జనాభాలో సగానికి పైగా 30 ఏళ్ళ లోపు ప్రతిభావంతులైన యువత ఉన్నారన్నారు. వీరి నైపుణ్యాన్ని సానుకూల మార్గంలో సమర్ధవంతంగా వినియోగించుకోవడం ద్వారా దేశాభివృద్ధి వేగాన్ని పెంచవచ్చని తెలిపారు. దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతున్నదని 2026 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్న నిపుణుల అభిప్రాయాలను ఈ సందర్భంగా ఉటంకించారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని శిక్షణార్థులకు సూచించారు. చక్కని పోషకాహారమైన భారతీయ సంప్రదాయ వంటకాలపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు సమాజం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని పౌరులు తమ హక్కులను కాపాడుకోవటంతో పాటు, కర్తవ్యాన్ని నిర్వహిస్తే అంతకు మించిన దేశభక్తి, సేవ ఏవి లేవన్నారు . పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అల్పాహార పథకాన్ని ప్రారంభించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ చొరవను అభినందించారు. ఇలాంటి పథకాలు ఉచిత పథకాలు కావని, ప్రభుత్వ కనీస బాధ్యతని తెలిపారు. తమిళనాడు అల్పాహార పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.. వ్యాధులు పెరుగుతున్న ప్రస్తుత కాలంలో, ఆరోగ్యకరమైన జీవనశైలిని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఈ ధోరణికి చెక్ పెట్టవచ్చని సూచించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరక్టర్ డా. బొల్లినేని భాస్కరరావు, స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు చిగురుపాటి కృష్ణప్రసాద్ ట్రస్ట్ నిర్వాహకులు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.