Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
మండల కేంద్రాలలో ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను అర్థం చేసుకుని పూర్తి బాధ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తహశీల్దార్లను ఆదేశించారు. ధరణి సమస్యల పరిష్కారానికి సోమవారం జిల్లాలోని అందరూ తహసీల్దార్, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు కేసులు లేని, క్లియర్ టైటిల్, పొజిషన్లో ఉండి, ఏలాంటి వివాదాలు లేకుండా ఉన్న ధరణి సమస్యలు తప్పకుండా పరిష్కరించాలని తహసీల్దార్లకు సూచించారు.ధరణి పనుల్లో సమస్యలు పరిష్కారం కావాలని, ఇతర సమస్యలు తలెత్తకూడదని అన్నారు. సక్సెషన్ కోసం డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను అందజేస్తే పరిష్క రించడం జరుగుతుందన్నారు. మోసపూరితంగా పట్టా ఇతరుల పేరుపై మార్పు అయినట్లయితే ఈ సమస్యల పరిష్కారం సివిల్ కోర్టుల పరిధిలో ఉంటుందని తహసీల్దార్ పరిధిలో ఉండదని స్పష్టంగా ప్రజలకు తెలియజే యాలన్నారు. అన్ని మండలాల్లో ప్రతీ సోమ వారం ప్రజావాణి విధిగా నిర్వహించి, ప్రజల సమస్యలకు సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు కలెక్టర్ కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అడిషనల్ కలెక్టర్‌తో కలిసి ధరణి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి రెండు ఆధారాలతో కబ్జాలో ఉన్న వారి వివరాలను వారం రోజులలో జిల్లాస్థాయి కమిటీకి ఆమోదానికి ప్రతి పాదనలు పంపించాలన్నారు. గండిపేట మరో హుస్సేన్ సాగర్ కాకూడదని, మూసి నది ద్వారా మురుగునీరు గండిపేటలో కలవకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా నుంచి మూసీ నది ద్వారా గండిపేటకు వెళ్లే వాగులు, నాలాలు కబ్జాకు గురైతే, వాటిని వికారాబాద్ ఆర్డీవో సర్వే అండ్ ల్యాండ్స్ ఏడిలు కలిసి సర్వే నిర్వహించి సరిహద్దు పిల్లర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. ఓటరు ఐడి కార్డులు జారీ విషయంలో ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి ట్రాన్స్ఫర్ కోసం పొలింగ్ బూత్‌ల వారీగా బీఎల్వోల ద్వారా వెంటనే క్లియర్ చేయించాలని తెలిపారు. అవసరమైన ఫామ్-7 నోటీసులను ఆర్డీవోల ద్వారా జారీ చేయించి సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆత్మ కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్ తాండూర్ ఆర్డీవోలు విజయ కుమారి, అశోక్ కుమార్‌లతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.