Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
- కడ్తాల్లో కొనసాగుతున్న 'హాత్ సే హాత్ జోడో' యాత్ర
నవతెలంగాణ-ఆమనగల్
ఏఐసీసీ ప్రధాన నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో మరువలేనిదని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' కొనసాగింపులో భాగంగా కడ్తాల్ మండలంలో కొన సాగుతున్న హాత్ సే హాత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణు ల్లో నూతనోత్సాహం పెంపొందిస్తుంది. ఈసందర్భంగా సోమ వారం మండలంలోని పల్లె చెల్కతండాలో కాంగ్రెస్ శ్రేణులు గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. భారత్ జోడో యాత్రలో ప్రజలు రాహుల్ గాంధీ దృష్టికి తెచ్చిన సమస్యలు గుర్తించి, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేక విధానాలను, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడ్తూ చార్జిషీట్ రూపంలో రూపొందించిన కరపత్రాలను గడప గడపకు చేరవేస్తున్నట్టు చెప్పారు. విద్య, వైద్యం ఉపాధి రంగాలను నీరుగార్చిన ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్రం, తెలంగాణాలో అన్ని ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేశాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, రైతు రుణమాఫీ అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పక్కదారి పట్టిస్తు కేంద్రం కార్పోరేట్లకు కొమ్ము కాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోస పూరిత వాగ్దానాలను ప్రజలకు వివరిస్తున్నట్టు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని భరోసా కల్పించారు. అంతకు ముందు తండాలో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బీక్యా నాయక్, మండల అధ్యక్షుడు యాట నర్సింహ ముదిరాజ్, ఎంపీటీసీ సభ్యులు పాలకుర్ల రాములు గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కేతావత్ హీరాసింగ్ నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రామకృష్ణ, ఎస్టీసెల్ అధ్యక్షులు శ్రీను నాయక్, సీనియర్ నాయకులు వెంకటయ్యగౌడ్, రమేష్ నాయక్, బాల్దాస్ నాయక్, రమేష్, రాజు, నరేందర్ నాయక్, నర్యా నాయక్, మాన్య నాయక్, రాజు నాయక్, బాలు నాయక్ పాల్గొన్నారు.