Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్,
- బీసీ జాతీయ కమిషన్ మాజీ మెంబర్ టి.ఆచారి
నవతెలంగాణ-తలకొండపల్లి
గత ఎన్నికలో 57 ఏండ్లు దాటిన వృద్ధులందరికీ పింఛన్ మంజూరు చేస్తానని హామీనిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజా గోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి తలకొండపల్లి మండల కేంద్రంలో బీజేపీ శక్తి కేంద్రం కార్నర్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీసీ జాతీయ కమిషన్ మాజీ మెంబర్ టి.ఆచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, నిరుద్యోగ భృతి కల్పించడం లేదని దుయ్యబట్టారు. సంక్షేమం కోసమే సంక్షేమ పథకాలు అన్ని చెబుతున్నారనీ, ఆ పథకాల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. బీసీ జాతీయ కమిషన్ మాజీ మెంబర్ టి. ఆచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించి ఎనిమిదేండ్లు గడుస్తున్నా, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. ఆమనగల్, తలకొండపల్లి రోడ్లు రూ.37 లక్షలతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందనీ, కానీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తానే తెచ్చానని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తలకొండపల్లి మండల అధ్యక్షులు రవిగౌడ్, ఎంపీటీసీ హేమరాజు, సీనియర్ నాయకులు పాండు ప్రసాద్, చంద్రధన సర్పంచ్ కుమార్, బీజేపీ రాష్ర నాయకులు, బీజేవైఎం రాష్ట్ర నాయ కులు పాండు, శ్రీకాంత్, శ్రీశైలం, శేఖర్‌రెడ్డి, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, తల్లోజి ఆచారిలకు చుక్కెదురు
తెలంగాణ ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్రతో భాగంగా సోమవారం రాత్రి వచ్చిన నాయకులు బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ బీసీ కమిషన్ మెంబర్ బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి తల్లోజ ఆచారిలను, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కో- కన్వీనర్ పోతుగంటి కృష్ణమాదిగ, ఎమ్మార్పీఎస్ తలకొం డపల్లి మండల నాయకులు అడ్డుకున్నారు. వారి మధ్య హోరా హోరిగా వాగ్దానం, తోపులాట చోటు చేసుకుంది. ఆచారి మాటలతో మరింత ఉధృతం నెలకొంది. పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులను ఆ ఘటనా స్థలం నుంచి తప్పించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కో-కన్వీనర్ పోతుగంటి కృష్ణ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని చూస్తే మాదిగలను మోసం చేసినట్టేనని దుయ్యబట్టారు. షెడ్యూల్ కులాల వర్గీకరణలో నమ్మక ద్రోహానికి పాల్పడితే బీజేపీని వదిలే ప్రసక్తే లేదన్నారు. మాదిగ పల్లెలోకి బీజేపీని రానివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కో-కన్వీనర్ పోతుగంటి కృష్ణ మాదిగ, మండల సీనియర్ నాయకులు దరువుల రాజు, నారాయణ, మీసాల రాములు, జంగారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు మీసాల మహేష్, బాలస్వామి, లక్ష్మయ్య, శివరాజ్, మహేష్, రవి, సలివయ్య, కుమార్, జంగయ్య, యాదయ్య, మహేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.