Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి
- ప్రజాక్షేత్రంలోకి కేంద్ర ప్రభుత్వ వైఫలాలు తీసుకెళ్తాం
- కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
డొల్ల కంపెనీల పేరుతో ప్రజాధానాన్ని కొల్లగొట్టిన అదానీని అరెస్టు చేసే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తోం దని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి మోడీ విధానాలను ఎండగడుతామని కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లోని రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీలు మధుసుదన్‌రెడ్డి, జ్ఞానేశ్వర్‌లతో కలిసి ఆయన మాట్లాడారు.. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశానికి చేసిందేమీ లేదన్నారు. ధనవంతుల జాబితాలో 609వ స్థానంలో ఉన్న అదానీని 2వ స్థానానికి తేవడం తప్పా ఇంకేమీ లేదని విమర్శించారు. నల్లధనాన్ని బయటికి తీసి పేద ప్రజలకు పంపిణీ చేస్తానన్న మోడీ పేదల సొమ్మును దోచుకుని నల్ల కూబేరులను తయారు చేశారన్నారు. మోడీ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా కాగ్, సీబీఐ ప్రభుత్వ సంస్థలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా బీజేపీ ప్రజలను దృష్టి మళ్లీస్తోందన్నారు. మోడీ దేశ సంపదను తమ దోస్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు మాట్లాడిన అంశాల ను చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. దేశ ఆస్తులపై కొంతమందే గుత్తాధిపత్యం చేలాయిస్తు న్నారన్నారు. కేంద్రంలో బీజేపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు అవగాహన పర్చేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నారు. రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చేపట్టిన యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతుందని అన్నారు. భవిష్యత్ కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజు, కార్పొరేటర్లు చల్లా బాల్‌రెడ్డి, సిద్ధాల శ్రీశైలం, గెల్లా సుభాష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.