Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్
- హైదరాబాద్ టు బీజాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో
- భారీగా ట్రాఫిక్ జామ్
- కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- మార్కెట్ కమిటీ చైర్మెన్ హామీతో శాంతించిన రైతులు
రైతులు ఆరుకాలం కష్టపడి పంటను పండిస్తే దానికి తగిన ఫలితం దొరకడం లేదు. పండిన పంటను మార్కెట్లో విక్రయించేందుకు వెళ్తే దళారులు, వ్యాపారస్తులు రైతులను నట్టేట ముంచుతున్నారు. వేరుశనగకు భారీ డిమాండ్ ఉండడంతో రైతులు వేరుశనగ పంటను భారీ మొత్తంలో సాగు చేశారు. గత వారం వరకు మార్కెట్లో వేరుశనగ ధర 8,200 నుండి ఆ పైనే పలికింది. కానీ ఈ వారం రూ.6 వేలు పలుకుతుంది. దీంతో రైతులు అయోమయానికి గురయ్యారు. ఆగ్రహానికి గురైన రైతులు శనివారం హైదరాబాద్ టు బీజాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నవతెలంగాణ-పరిగి
గిట్టుబాటు ధర కల్పించాలి
పరిగి పట్టణ కేంద్రంలో తాము పండించిన వేరుశనగ పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదని రైతుల ఆందోళన వ్య క్తం చేశారు. వికారాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వేరుశనగ రైతుల శుక్రవారం తమ పంటను అమ్ముకోవడానికి పరిగి మార్కెట్కు తీసుకువచ్చారు. శుక్రవారం వ్యాపారస్తులు, దళారులు బీట్లు నిర్వహించకుండా ఆపివేశారు. దీంతో రైతులు రాత్రంతా మార్కెట్లోనే జాగారం చేశారు. శనివారం వ్యాపారస్తులు వేరుశనగ ధర రూ.5, 400 నుండి రూ.6,400 వరకు నిర్ణయించారు. దాంతో రైతులలో ఆందోళన మొదలైంది. గత వారం రూ.8,200 వరకు పలికిన వేరుశనగ ధర ఒక్కసారి తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడున్న దళారులు, వ్యాపారస్తులు ఒకటై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బయట నుండి వ్యాపారస్తులు వచ్చి కొనడానికి వస్తే వారిని కొననివ్వడం లేదని చెప్తున్నారు. నాలుగైదు వారాల నుంచి బయట వ్యాపారులు రావడంతోనే వేరుశనగ పంటకు ధర పలికిందని, ఇప్పుడు ఇక్కడున్న వ్యాపారస్తులు ఒకటై రేటు తక్కువ చేశారని తెలిపారు. ఒకవైపు వంట నూనె ధర ఆకాశానందుతుంటే, మరో వైపు వేరుశెనగ ధరను పాతాళానికి తొక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటను సాగు చేస్తే పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎరువుల ధరలు, కూలీల కూలి కూడా భారీగా పెరగడంతో ఎకరాకు రూ.60వేలు నుంచి రూ.70 వేల వరకు ఖర్చు వస్తుందని తెలిపారు. ఎకరాకు 15 నుండి 20 బస్తాల వర కు వేరుశనగ పంట వస్తుందని, కానీ ఈ రేటుకు అమ్ము కుంటే పెట్టుబడి కూడా రావడం లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమకు న్యాయం చేయాలని హైదరాబాద్ టు బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేశా రు. దాదాపు గంటన్నర పాటు రహదారిపై బైఠాయించడం తో కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ వచ్చి రైతులను సంజాయించే ప్రయత్నం చేసినా రైతులు వినకుండా భీష్పించి కూర్చున్నారు. దాదాపు అరగంట సేపు రైతులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు.
రైతులందరం నష్టపోతున్నాం
గతవారం పరిగి మార్కె ట్లో వేరుశనగ ధర రూ.7,900 నుంచి రూ. 8వేలు పలికింది. కానీ ఇప్పుడు రూ.5,400 ధర నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ధరనే ఇప్పుడు కొనసాగించాలి. శుక్రవారం వ్యాపారస్తులు, దళా రులు అందరూ మాట్లాడుకొని బీట్లు నిర్వహించలేదు. బయటి వారిని రానివ్వకుండా అందరూ ఒకటై శనివారం తక్కువ ధరకు బీట్లు నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
- నారాయణ, రైతు, దారూర్ మండలం
పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు
నేను రూ.మూడు లక్షలు పెట్టుబడి పెట్టి ఐదు ఎకరాలలో వేరుశనగ పంటను సాగు చేశాను. మార్కెట్లో అమ్మడా నికి తెస్తే రూ.2లక్షల50వేలు రావడం లేదు. చేసిన కష్టం కూడా మీద పడుతుంది. ఒక్కో కూలీ రూ.500 వరకు తీసుకుం టున్నారు. వాతావరణం బాగు లేక దిగుబడి కూడా తగ్గింది. పెట్టిన పెట్టుబడి రాకపో వడంతో అప్పుల ఊబిలో కూలిపోతున్నాం. శుక్రవారం పరిగి మార్కెట్లో వేరుశనగ అమ్మడానికి తీసుకువచ్చాం కానీ బీట్లు నిర్వహించకుండా వ్యాపారస్తులందరూ ఒక్కటై శనివారం తక్కువ ధరకు బీట్లు ప్రారంభించారు. దీంతో మేమందరం రోడెక్కాల్సి వచ్చింది. వేరుశనగకు మద్దతు ధర కల్పించాలి.
- వెంకటయ్య, రైతు, రంగంపల్లి
రైతులకు న్యాయం జరిగేంత వరకూ పోరాడుతాం
రాత్రనక, పగలనక రైతులు కష్ట పడి పంటను పండించి మార్కెట్కు తీసుకువస్తే దళారులు దోచుకుంటు న్నారు. పరిగి మార్కెట్లో దళారులు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు. దళారులు, వ్యాపారస్తులు అందరూ రైతులను మోసం చేస్తున్నారు. రూ.8,200 వరకు ధర పలికిన వేరుశనగకు, రూ.5వేలు, రూ. 6వేలు ధర కేటాయించడం దుర్మార్గం. రైతులకు మద్దతు ధర కల్పించే వరకూ పోరాడుతాం.
- నర్సింలు, రూప్ఖాన్పెట్, సర్పంచ్