Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లాలో 182 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు
- హాజరుకానున్న 1.37 లక్షల మంది విద్యార్థులు
- హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్స్ సంతకం లేకున్నా సరే..
- ఊపిరి పీల్చుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు
ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పక్క ప్రణాళికలు చేపడుతుది. రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకపోయిన పర్వలేదని ఇంటర్ బోర్డు విద్యార్థులకు తీపికబురు చెప్పడంతో విద్యార్థులు, విదార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. నిమిషం నిబంధన ఖచ్ఛితంగా అమలవుతుండటంతో విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని అధికారులు సూచించారు.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1.37 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 71,800 మంది ఉండగా సెంకడ్ ఇయర్ విద్యార్థులు 55,800 మంది ఉన్నారు. ఇందుకుగాను జిల్లాలో 182 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా కేంద్రాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేపడతున్నారు. పరీక్షా కేంద్రాల్లో పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ, హైఫర్ కమిటీ, నలుగురు ప్లైయింగ్ స్కాడ్స్, నలుగురు సిట్టింగ్ స్కాడ్స్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్స్
సంతకం అవసరం లేదు
గతంలో హాల్‌టికెట్లపై ఖచ్ఛితంగా కళాశాల ప్రిన్సి పాల్ సంతకం ఉంటేనే విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇచ్చేది. దీంతో పరీక్షల సమయంలో ఆయా కళా శాల యాజమాన్యాలు పెండింగ్ ఫీజులు కోసం విద్యార్థుల ను వేధించేవి. డబ్బులు చెల్లించే వరకు హాల్ టికెట్లపై సం తకాలు చేసేవారు కాదు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులకు ఊరట లభించింది. ఇంటర్ బోర్డు ఆన్లైన్లో పెట్టిన హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలకు వెళ్లోచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకోవాలి
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం నిబంధన ఖచ్ఛితంగా అమలవుతుంది. హాల్ టికెట్లు ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు. పరీక్షల సమయంలో ఎలాంటి టెన్షన్‌కు గురికాకుండా విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
- వెంకయ్యనాయక్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి