Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణాలతో స్వయం ఉపాధి
- కష్టపడి కుటుంబాన్ని పోషించుకున్న
- పిల్లలను ఉన్నత చదువులు చదివించుకున్న పొదుపు సంఘం సభ్యురాలు చీమల లక్ష్మి
నవతెలంగాణ-శంకర్పల్లి
గ్రామాల్లో పొదుపు సంఘం చాలా కీలకమైంది. ప్రతీ మహిళా పొదుపు సంఘంలో ఉంటుంది. అందులో వచ్చే రుణాలతో స్వయం ఉపాధి పొంది, కుంటుంబాన్ని సాదుకుంటుంది. ఓ మహిళ కూడా పొదుపు సంఘంతో తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంది. తన పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంది. కష్టాల నుంచి ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంది. ఆమె శంకర్పల్లి మండలంలోని గోపులారం గ్రామానికి చెందిన చీమల లక్ష్మీ. పొదుపు సంఘం వలన కలిగే లాభాలు, ఇతర విషయాలు ఆమె మాట్లాల్లోనే తెలుసుకుందాం.
'పొదుపు సంఘంలో చేరక ముందు చాలా ఇబ్బంది పడ్డాను. కుటుంబ పోషణ చాలా భారంగా ఉండేది. నాకు నలుగురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. మాకు భూమి కూడా లేదు. కూలీ చేసి పిల్లలను పెంచుకున్నా. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. పొదుపు సంఘంలో చేరిన తరువాత నా పరిస్థితి కొద్దిగా మెరుగుగపడింది. గ్రామంలో పదిమంది సభ్యులం కలిసి సంఘం ఏర్పడినం. ప్రతి నెలా రూ.100 చొప్పున వెయ్యి పొదుపు చేస్తూ ఆరు నెలల వరకు బ్యాంకులో పొదుపు చేశాం. ఆ తరువాత బ్యాంక్ మాకు రూ.50వేలు అప్పు ఇచ్చింది. ఆ రుణాలతో ఇంటి కాసం తెచుకున్నాం. లోన్ తీర్చాక మళ్లీ రూ.లక్ష ఇచ్చారు. ఆ డబ్బులతో మూడు మేకలు కొన్నాను. ఆ తరువాత మళ్లీ రూ. రెండు లక్షలు ఇచ్చారు. దాన్నీ పిల్లల చదువులకు ఖర్చు చేశాను. ఈ లోను తీరిన తర్వాత మళ్లీ రూ.50 వేలు తీసుకుని ఏడు మేకలను కొన్నాను. మేకల ద్వారా వచ్చిన ఆదాయంతో అప్పు కడుతూ, పిల్లలను చదివించాను. ఒక కుమారుడు బీఈడీ, మరో కుమారుడు ఐటీఐ చేశారు. కూతుళ్లలో పెద్ద అమ్మాయి టీటీపీ, బీఈడీ చేసింది. ఆమె పెండ్లి కూడా చేశాను. రెండవ కూతురు బీఎస్సీ, బీఈడీ చేసింది. ఆమె ప్రస్తుతం ప్రయివేట్ టీచర్‌గా పని చేస్తోంది. నా కుటుంబంలోని వారంతా తమ సొంత కాళ్ల మీద నిలబడ్డారు. ప్రస్తుతం బ్యాంకు లోన్ మళ్లీ లక్ష వచ్చింది. ఆ డబ్బుతో నా కుమారుడు ప్రయివేటు స్కూల్ నడిపిస్తున్నాడు. సంఘంలో ఉండడం వలన ఆర్థికంగా ఎదగడమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపు వచ్చింది.' పొదుపు సంఘంలో చేరితే ఎన్ని లాభాలు ఉన్నాయో లక్ష్మి వివరించింది. ఎవరన్నా మహిళలు గ్రూపులో చేరకపోతే వెంటనే పొదుపు సంఘంలో చేరి మీ కుటుంబాలను బాగుపరచుకోవాలని సూచించింది. నేటి మహిళలకి ఆమె ఆదర్శంగా నిలుస్తోంది.