Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత తప్పనిసరి
- వ్యక్తిగత సమాచారం ఆన్లైన్లో షేర్ చేయొద్దు
- రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్
- దేవేంద్ర సింగ్ చౌహాన్
- ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇన్స్ట్టిట్యూషన్లో సైబర్ నేరాలపై అవగాహన
- వాల్‌పోస్టర్, టోల్‌ఫ్రీ స్టిక్కర్ల ఆవిష్కరణ
- ఇబ్రహీంపట్నం నుంచి విస్తృత ప్రచారం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత అవసరమన్నారు. మహిళలు, యువత తమ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో షేర్ చేయొద్దని గుర్తు చేశారు. సైబర్ నేరాలపై రాచకొండ పోలీష్ కమిషరేట్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, గోడపత్రికల, టోల్‌ఫ్రీ స్టిక్కర్ల ఆవిష్కరించారు. ఈ నేరాలపై పోలీస్ కమిషనరేట్ ఆధ్వ ర్యంలో చేట్టనున్న విస్తృత ప్రచారాన్ని ఇబ్రహీంపట్నం నుంచే ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో వివిధ రకాల అవసరాలకు ఎన్నో రకాల సాంకేతిక పరికరాలు ఉపయోగించడం జరుగుతోందన్నారు. వాటి వల్ల పలు రకాల మార్గాల్లో జరిగే నేరాలతో ఎంతో మంది బాధితులు నష్టపోతున్నారని వివరించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు భద్రపరుచుకోవాలని సూచించారు. సరైన సైబర్ సెక్యూరిటీ లేని ప్రదేశాల్లో కార్డులు వీలైనంత వరకు ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. లాటరీల్లో డబ్బు గెలుచుకున్నారనీ, వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు సురక్షితం కాని పబ్లిక్ వైఫైలను ఉప యోగించి ఎటువంటి డిజిటల్ చెల్లింపులూ చేయవద్దని చెప్పారు. సోషల్ మీడియాలో యువత అజాగ్రత్తగా ఉండడం వల్ల, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారని తెలిపారు. అపరిచితులతో సోషల్ మీడియా స్నేహాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సైబర్ స్టాల్కింగ్, సైబర్ బుల్లియింగ్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తతతోనే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండొచ్చని గుర్తు చేశారు. ఏవైనా సైబర్ నేరాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ శ్రీబాల మాట్లాడుతూ.. అనవసర వెసేజ్లను క్లిక్ చేయవద్దన్నారు. ఇబ్బందులెదురైతే సైబర్ క్రైమ్ 1930కి కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురునానక్ విద్యాసంస్థల వైస్ చైర్మెన్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ, ఎండీ సైనీ, మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్ రావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశం, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సావిత్రి, మోటివేషనల్ స్పీకర్ అనిల్ రాచమల్ల, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.