Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-షాద్నగర్
ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ, సీడీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల పేరుతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ విధానాలను దేశ ప్రజలు ఎండగట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.గురువారం షాద్ నగర్ పట్టణంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగం మనువాదంపై జరిగిన సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తూ, రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను వేట కుక్కల్లాగా మలుచుకుని ప్రతిపక్ష పార్టీలపై దాడులే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. మతోన్మాదుల ఆగడాలకు అంతులేకుండా పోతుందని, బీజేపీని ఓడించడమే ఎజెండాగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
భారత రాజ్యాంగం ప్రమాదం అంచుల్లో ఉంది
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం
భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, మనువాద రాజ్యాన్ని అమలు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఫలితంగానే నేడు బీసీ, ఎస్సి, ఎస్టీలు అధికారంలో కొనసాగుతున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం లేకుంటే దళితుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ రాజ్యాంగలలో భారత రాజ్యాంగం అతి పెద్దదని, అలాంటి రాజ్యాంగం ద్వారానే ఎంతో మంది అణగారిన ప్రజలు అధికారం వైపు వెళ్లారని అన్నారు. రాజరికంలో ఉన్న పరిస్థితులను మళ్లీ అమలు చేయడానికి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.రాజ్యాంగాన్ని మారిస్తే మళ్ళీ పాత పరిస్థితులు ఎదురవుతాయని, అలాంటి పరిస్థితులు రాకుండా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ. రవీంద్ర చారి, కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగ్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్ధుల జంగయ్య, ఎం శ్రీను, ఓరుగంటి యాదయ్య, ఎం యాదిరెడ్డి, కావలి నరసింహ, కే చందు, టి రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ పవన్ తదితరులు పాల్గొన్నారు.