Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. మధుసూదన్ రెడ్డి
- యాచారంలో జీపు జాత ప్రారంభం
నవతెలంగాణ-యాచారం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం యాచారం మండల కేంద్రంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యాచారం నుంచి చౌదర్పల్లి, ధర్మన్నగూడ, చిన్న తుండ్ల, సింగారం, కుర్మిద్ధ, నానక్ నగర్, మేడిపల్లి, మల్కీ జ్ గూడల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సహకార రంగంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోడీ ప్రభుత్వం విధానాలు తీసుకొస్తుందన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించారని విమర్శించారు. అంతేకాకుండా ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించి, కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. 60 ఏండ్లకు పైబడిన రైతులందరిని గుర్తించి, పింఛన్లు ఇవ్వాలన్నారు. నిత్యవసరాల ధరలను విపరీతంగా పెంచి, నిరుపేదలపై అధిక భారం వేస్తుందని ధ్వజ మెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొ రట్లకు అప్పనంగా అందజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టం ద్వారా 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గడపగడపకూ తెలుపడానికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ జీపు జాతాను చేపట్టినట్టు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలను ఈ జాతా ద్వారా చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, అధ్యక్షులు పెరుమాండ్ల అంజయ్య, సీఐటీయూ శ్రామిక మహిళా కన్వీనర్ కవిత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్, పీఎన్ఎసం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, పీఎన్ఎం జిల్లా నాయకురాలు శారద, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ సామెల్, కేవీపీఎస్ జిల్లా నాయకులు ఆలంపల్లి నరసింహ, ఐద్వా మండల కార్యదర్శి మస్కు అరుణ, ఉమా, సీఐటీయూ జిల్లా నాయకులు కురుమయ్య, ధర్మన్నగూడ సర్పంచ్ మండల బాషయ్య, నానక్ నగర్ సర్పంచ్ పెద్దయ్య, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి అమీర్పేట మల్లేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ముసలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ జంగయ్య, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆలంపల్లి జంగయ్య, విప్లవ కుమార్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.