Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంటకుపైగా కురిసిన వడగండ్లు
- కాశ్మీర్‌ను తలపించిన మర్పల్లి
- గంటల తరబడి పేరుకుపోయిన మంచు గడ్డలు
- భారీగా నష్టపోయిన వరి, మామిడి తోటలు, ఇతర పంటలు
- ధ్వంసమైన వాహనాలు
అకాల వర్షం రైతున్నను అతలాకుతలం చేసింది. చేతికి వచ్చిన పంటను నేలపాలు చేసింది. వడగండ్లు గంటల తరబడి పడడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్లు మొత్తం మంచుతో నిండిపోయాయి. వడగండ్లతో వాహనా లు, ఇండ్లు ధ్వంసం అయ్యాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వడగండ్ల వానతో అన్నదాత ఆశలు అవిరి అయ్యాయి. పంటలు దెబ్బతినడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
నవతెలంగాణ-మర్పల్లి
గతంలో ఎప్పుడూ లేని విధంగా గురువారం భారీగా కురిసిన వడగండ్లకు మర్పల్లి మరో కాశ్మీర్‌ను తలపించింది. మధ్యాహ్నం కురిసిన భారీ వడగండ్ల వానకు రోడ్లు, భూమిని మంచు గడ్డలు కమ్మేయడంతో ఎటు చూసినా మంచుతో పేరుకుపోయి కనిపించింది. సుమారు రెండు గంటలకు పైగా మంచు గడ్డలతో ప్రకృతి ఆహ్లాదకరంగా మారింది. మర్పల్లి మండల కేంద్రంతో పాటు కోట్ మర్పల్లి, సిరిపురం, కొత్ల పురం, పిల్లిగుండ్ల, భూచన్పల్లి, పంచ లింగాల్, వీర్లపల్లి, గ్రామాల్లో భారీగా వడగళ్ల వర్షం కురవ డంతో వీధులన్నీ తెల్లని మంచు గడ్డలతో నిండిపోయాయి. భారీగా వడగండ్లు పడటంతో ఉల్లిగడ్డ, మొక్కజొన్న, జొన్న, అరటి, కూరగాయ పంటలతో పాటు, చింత, మామిడి చెట్లు ఖాత పూర్తిగా నేల రాలిపోయింది. వడగండ్ల దెబ్బలకు చెట్ల ఆకులు పూర్తిగా రాలిపోయి చెట్లు కలాహీనంగా మారాయి. దీంతో రైతులు, వ్యాపారస్తులకు భారీగా నష్టం వాటిల్లింది, కోట్ మర్పల్లి గ్రామానికి చెందిన చిరగన గారి శేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకట్ రెడ్డిల కార్లు భారీగా కురిసిన వడగండ్లకు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
భారీ వర్షం : బక్క రామయ్య, రైతు
గతంలో ఎన్నడూ లేని విధంగా గురువారం మర్పల్లిలో భారీ వడగండ్ల వర్షం కురిసింది. రోడ్లు, వీధులు మంచుతో కప్పబడ్డాయి. నేను 80 సంవత్సరాలకు పైగా ఉంటాను. ఇంత పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఎటు చూసినా మంచుతో కప్పబడిన ప్రదేశాలు కనిపించాయి. పంటలకు, మామిడి, చింత తోటలకు భారీ నష్టం వాటిల్లింది.
పంటలు నేలమట్టం అయ్యాయి : పంతులుబావి శ్రీనివాస్, రైతు
నాకున్న మూడెకరాలు, మరో ఎకరా భూమి కౌలుకు తీసుకొని మూడు ఎకరాల్లో టమాట, ఒక ఎకరా కాలీఫ్లవర్ వేశా. రూ.3 లక్షల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశాను. సుమారు పది లక్షల పైగా లాభాలు వస్తాయనుకున్న. భారీ వడగండ్ల వర్షానికి పంటలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయి.
పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి : రవీందర్ రెడ్డి, రైతు
7 ఎకరాల్లో క్యాబేజీ, టమాట, కాలిఫ్లవర్ పంటల ను రూ. మూడు లక్షల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశాను. ఖరీదైన పురుగు మందులు వాడి రాత్రి, పగలు కష్టపడి పంటలను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఆశాజ నకంగా ఉన్న పంటలు అకాల వడగండ్ల వర్షానికి పూర్తిగా నేలమట్టమయ్యాయి. రూ.12 లక్షలకు పైగా దిగుబడి వచ్చేది. చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
ప్రభుత్వం ఆదుకోవాలి : నజీర్, కోట్ మర్పల్లి
రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వేశాను. వేల రూపాయల పెట్టుబడి పెట్టి రాత్రి, పగలు అనక కష్టపడి పంటను సాగు చేశాను. పంట ఆశాజనకంగా ఉన్న సమయంలో గురువారం కురిసిన వడగళ్ల వర్షానికి రెండు ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా ధ్వంసం అయింది. భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
మొక్కజొన్న ధ్వంసం అయింది : బన్నే మల్లేష్, రైతు
కౌలుకు తీసుకొని సాగుచేసిన నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట వేశా. పూర్తిగా ధ్వంసం అయింది. ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలి.