Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను చైతన్య పరిచేందుకే సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర
- మాల్ కేంద్రంలో స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు
- నల్లవెల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు 2వేల మందితో ర్యాలీ
- ఎర్ర చొక్కాలతో దద్దరిళ్లనున్న సాగర్ హైవే
నవతెలంగాణ-యాచారం
కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర చేపట్టిన విషయం విధితమే. పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మూడు యాత్రలు చేపట్టారు. ఈ నెల 17వ తేదీన వరంగల్‌లో ప్రారంభమైన మొదటి యాత్రకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పొతినేని సుదర్శన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ యాత్ర మంగళవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనుంది. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో యాత్ర కొనసాగనుంది. యాచారం మండలంలో నిర్వహించే యాత్ర కోసం మండల పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ యాత్రలో భాగంగా యాచారం మండల పరిధిలోని మాల్ కేంద్రం నుంచి నల్లవెల్లి మీదుగా ఇబ్రహీంపట్నంకు జన చైతన్య యాత్ర సాగనుంది. ఈ యాత్రకు భారీ స్వాగతం పలికేందుకు సీపీఐ(ఎం) యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు రెండే వేల మంది ఎర్ర చొక్కాలు ధరించి ర్యాలీలో పాల్గొంటారు. మంగళవారం సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రతో సాగర్ హైవే ఎర్రదండును తలపించేలా మండల నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ జన చైతన్య యాత్ర నల్లవెల్లిలో ప్రారంభమై యాచారం మండల కేంద్రం చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఈ యాత్రలో పాల్గొనే వారి కోసం ఢఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో భోజన ఏర్పాట్లు చేశారు. మండల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మధుసూదన్‌రెడ్డి, పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, మండల కమిటీ సభ్యులు పెరుమాండ్ల అంజయ్యలు పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎం) శ్రేణులు యాత్రను విజయవంతం చేయాలి
నేడు యాచారం పరిధిలోని నల్లవెల్లి గ్రామం నిర్వహించే సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రలో పార్టీ బాధ్యులు, అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ ఎర్ర చొక్కా ధరించి, బైక్‌తో హాజరుకావాలి. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయడమే ఆ యాత్ర లక్ష్యం.
- పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ
నేడు 2వేల మందితో
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర ర్యాలీ
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న జన చైతన్య యాత్రకు స్వాగతం పలి కేందుకు ఏర్పాటు పూర్తి చేశాం. పార్టీ కామ్రేడ్లు దాదాపు రెండు వేల మంది ఎర్ర చొక్కాలు ధరించి స్వాగతం పలకుతాం. ముఖ్యంగా ఈ యాత్ర ప్రజలను చైతన్యవంతులను చేసి, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికే. మోడీ విధానాలతో పేద ప్రజలు ఎంతో నష్టపోయారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం.
- పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మధుసూదన్ రెడ్డి
ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యం
బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఈ యాత్ర చేపట్టింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు తెర లేపింది. కార్మిక చట్టాలను అమలు చేయకుండా దొంగ చాటున లేబర్ కోడ్లను తీసుకొచ్చి నల్ల చట్టాలను అమలు చేయాలని చూస్తుంది. ఈ ఆంశలను ప్రజలకు వివరించేందుకే ఈ యాత్ర. ఈ యాత్రలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలి.
- సీపీఐ(ఎర)పెరుమాండ్ల అంజయ్య