Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేబి దొడ్డి గ్రామస్తుల ఆవేదన
- ఊరు మునిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్న వైనం
నవతెలంగాణ-శంషాబాద్
వాగులను ధ్వంసం చేస్తుంటే అధికారులు ప్రజాప్రతినిధులు చోద్యం చూడడం ఏమిటని మండల పరిధి లోని కెబిదొడ్డి గ్రామస్తులు ప్రశ్ని స్తున్నారు. ప్రస్తుతం మల్కారం రెవిన్యూ పరిధిలో అమ్డపూర్ బ్రిడ్జి పక్కన నిర్మిస్తున్న వెంచర్ వల్ల గ్రామం మునిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేస్తు న్నారు. హిమాయత్ సాగర్‌కు ప్రధానమైన వరద కాలువ ఈసీవాగు, వర్షాకాలంలో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి గుట్టల నుంచి జాలువారుతూ షాబాద్ మండలం మీదుగా శంషాబాద్ మండలంలోని రామంజాపూర్ వద్ద ఉదృతంగా ప్రవహిస్తూ సుల్తాన్‌పల్లి మీదుగా హిమాయత్ సాగర్‌లో కలుస్తుంది. ఈ వాగుపై అక్రమ నిర్మాణాల వల్ల సాగర్ నూటికి నూరు శాతం కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి అత్యంత ప్రముఖమైన ప్రాధాన్యత కలిగిన ఈసీ వాగును కొంతమంది అక్రమార్కులు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ధ్వంసం చేస్తుంటే అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. 111 జీవో పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై నిషేధం ఉంటే ఏకంగా వాగునే చెరబట్టి అక్రమ నిర్మాణాలు చేస్తుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధన దాహానికి ఈసివాగు, అంచమడుగు నాశనం అవుతున్నాయి. ఈ వెంచర్ నిర్మాణం వల్ల మండల పరిధిలోని కెబి దొడ్డి వరద ముంపునకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇష్టానుసారం అక్రమ వెంచర్ ఏర్పాటు చేస్తుంటే ఊరు మునుగితే ఎవరు బాధ్యులు అంటూ కేబి దొడ్డి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామస్తులు ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. తాజాగా అక్కడ వెంచర్ నిర్మాణ పనులు జోరుగా సాగుతూనే ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.