Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆనందం వ్యక్తం చేస్తున్న అజయ్ నటరాజ కళా నిలయం వ్యవస్థాపకులు మానపాటి ప్రదీప్ కుమార్
- షాద్ నగర్ పట్టణంలోని భగీరథ కాలనీలో అరుదైన బ్రహ్మ కమలం పుష్పాలు
నవతెలంగాణ-షాద్నగర్
ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాల్లో, హిమాలయాల్లో మాత్రమే వికసించే అరుదైన బ్రహ్మ కమలం పుష్పాలు షాద్ నగర్ పట్టణంలో వికసించాయి. షాద్ నగర్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు మానపాటి విజయరత్నం, విమల ద్వితీయ పుత్రుడు మానపాటి ప్రదీప్ కుమార్ ఇంట్లో ఆదివారం రాత్రి 11:45 గంటల సమయంలో ఈ బ్రహ్మ కమలం పుష్పాలు వికసించాయి. బ్రహ్మ కమలాలు వికసించిన ప్రాంతమంతా సువాసన వెదజల్లుతుంది. నాలుగేండ్ల క్రితం నాటిన బ్రహ్మ కమలం మొక్క ఇప్పటికీ మూడుసార్లు పుష్పాలను వికసించిందని యజమాని ప్రదీప్ కుమార్ తెలిపారు. పరమ పవిత్రమైన బ్రహ్మ కమలం పుష్పాలు వికసించడంతో ఇంటి యజమానితో పాటు కాలనీవాసులు పుష్పాలకు ప్రత్యేక పూజలు చేశారు.
హిందూ పురాణాల ప్రకారం వికసించిన బ్రహ్మ కమలంపై బ్రహ్మదేవుడు ఆశీనుడై ఉంటారని వేద పండితులు చెబుతారు. బ్రహ్మ కమలం పుష్పాలు మామూలుగా అయితే హిమాలయాల్లో విరివిగా ఉంటాయని, మన ప్రాంతాల్లో చాలా అరుదుగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. హైందవ పురాణాల్లో ఈ పుష్పానికి చాలా విశిష్టతలు ఉంటాయని, పరమశివుడిని బ్రహ్మ కమలం పుష్పంతో పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని పలువురు భక్తులు తెలిపారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే ఈ అరుదైన పుష్పాలు కొన్ని గంటలు మాత్రమే వికసించి ఉంటాయి. దీంతో వికసించిన బ్రహ్మ కమలం పుష్పాలను చూడడానికి కాలనీవాసులు , మిత్రులు ప్రదీప్ కుమార్ ఇంటికి తరలి వెళ్లారు.ఈ సందర్భంగా మానపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మాత్రమే పుష్పించే ఈ పూలు మండు వేసవిలో పుష్పించడం శుభ పరిణామంగా భావిస్తున్నానని అన్నారు.