Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
గొర్రెల ఉత్పత్తి శాతం పెంచేందుకు ప్రభుత్వం ప్రొత్సాహం కల్పించడంతో పాటు కురుమ, యాదవుల ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాయితీపై పంపిణీ చేస్తోంది. పెద్దపీట వేస్తూ వెనుకబడిన వారికి ప్రభుత్వ సహకారం అందిస్తుంది. దీంతో వాటి ఉత్పత్తి భారీగా పెరిగింది. గతంలో కంటే ఈసారి పెంపకం మెరుగ్గా ఉంది. ఇటీవల యువత గొర్రెల, మేకల పెంపకమే ఉపాధిగా చేసుకుంటున్నారు. అయితే ఈ జీవాల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉందని, అవి పాటించాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా గొర్రెల పెంపకం కోసం వారు చెబుతున్న జాగ్రత్తలు.
గొర్రెల మంద, పాకలను శుభ్రంగా ఉంచాలి.....
మేకలు గొర్రెలు ఉండే పాక లను రోజు శుభ్రం చేయాలి నేల ఎప్పుడూ పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. వారానికొకసారి సున్నం చల్లాలి. సాయంత్రం సమయాల్లో దోమల నివారణకు పొగ పెట్టాలి. మందలో ఉండే బలహీన జీవాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రతి జీవానికి మరిచిపోకుండా బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి....
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు.....
గొర్రెల మందలోనే జీవాలు అన్నింటికీ ఏడాదిలో మూడు నుంచి నాలుగు సార్లు సామూహిక నట్టల నివారణ మందులు తాగించాలి. ఏటా మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్లలో నట్టల నివారణ మాత్రలు వేస్తే జీవులు ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాధులు సోకకుండా ఉండేందుకు నిదానంగా వ్యాధినిరోధక టీకాలు వేయించాలి. జనవరిలో పీపీఆర్ మార్చిలో గాలికుంటూ మేలో చితుకురోగం, సెప్టెంబర్లో దొమ్మా రోగం, నవంబర్లో సూచి వ్యాధుల నివారణకు తప్పనిసరిగా చేయించాలి. ఏడాదిలో కనీసం రెండుసార్లు పేలు పిడుదులు, గోమార్లు, పరాన్నజీవుల నిర్మూలనకు మందులు పిచికారి చేయాలి. ఏడాదిలో రెండుసార్లు గొర్రెల ఉన్ని కత్తిరించాలి. మరణించిన ప్రతి జీవాన్ని భూమిలో పాతిపెట్టి గ్రామంలో కట్టడి చేసుకోవాలి. వైద్యుల సలహాలు లేకుండా విచక్షణ రహితంగా మందులు వాడొద్దు. పుట్టిన పిల్ల జీవాలను నిర్లక్ష్యం చేయకుండా జున్ను పాలు తాగించాలి. మట్టి తినకుండా ఖనిజ లవణాల ఇటుకలు వేలాడదీయాలి. పుట్టిన ప్రతి జీవి ఆరోగ్యంగా ఉంటేనే జీవాలు మందవృద్ధి చెందుతుంది.
జీవాలకు మంచి మేత వేయాలి......
జీవాలకు మంచి మేత వేసినప్పుడే ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో ఉత్పాదక సామర్థ్యం పెరిగి లాభాలు గడించే అవకాశం ఉంది. రోజంతా బయట మేపడంతో పాటు చౌకగా తయారు చేసుకునే దానాలను జీవాలకు అందించాలి. బయట మేత మేసే సమయంలో శుభ్రమైన నీటిని శుభ్రమైన నీటిని తాగేలా జాగ్రత్తలు పాటించాలి. గొర్రెల మంద ఒక దగ్గర పెట్టి సమయంలో ఖనిజలవణాలు, ఇటుకలు, కళ్లు, ఉప్పును ఏర్పాటు చేయడానికి అందుబాటులో ఉంచాలి.
పోషణ ఇలా.......
అధిక మాంసం ఉత్పత్తి చేసే గొర్రెల పెంపకం త్వరగా ఎదిగి ఎక్కువ మాంసం ఉత్పత్తి చేసే గొర్రెలను పోషించాలి. ఎక్కువగా ఎదకు వచ్చే జూన్, అక్టోబర్లో 100గొర్రెలకు, నాలుగు పొట్టేలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే జీవాలు ఎక్కువ సంఖ్యలో పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. సొంత మందలో ఉన్న పొట్టేళ్లను ఎదకు వినియోగించవద్దు. ఇతర మందులు ఉన్న పోటీలను మందలో వదలాలి. రెండేండ్లకు ఒకసారి పొట్టేళ్లను మార్చితే జీవాల మంద పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే బలవర్ధకమైన జీవాల ఉత్పత్తి పెరగడంతో పాటు అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.