Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న కేసులు
- నిబంధనల ఉల్లంఘనులపై జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ సంయుక్తంగా చర్యలు
- ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత పోలీసుశాఖదే
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజుకు 150కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వారం రోజులుగా కూకట్‌పల్లిలో అత్యధికంగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లతో ఐసీయూ వార్డులు ఫుల్ అవుతున్నాయి. రోగుల తాకిడి పెరగడంతో వారంలోనే ఆస్పత్రులు డిశ్చార్జి చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో 200 పడకలతో కరోనా వార్డు సిద్ధం చేశారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో 300 బెడ్లు కేటాయించారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో మరోసారి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే అవకాశంలేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అయితే కరోనా నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఎన్ఫోర్స్మెంట్, పెనాల్టీవేసే బాధ్యతను పోలీసుశాఖకు అప్పగించారు.
పెరుగుతున్న కేసులు
గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో పరిధిలోని కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లాల్లోని ఆంధ్రమహిళా సభ, దూద్‌బౌలి,చింతలబస్తీ, ఆగాపుర, అమీర్‌పేట్, గోల్కోండ, రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్బీనగర్, బాలాపూర్, రాజేంద్రనగర్, మేడ్చల్ జిల్లాలోని బాలానగర్, కూకట్పల్లి, ఆల్వాల్, ఉప్పల్ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా పరిశీలిస్తే 100 నుంచి 150కేసుల మధ్య ఉన్నాయి. మంగళవారం 184కేసులు నమోదయ్యాయి.
ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత పోలీసుశాఖదే
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన నిబంధనలు అమలు, పర్యవేక్షణ, ఉల్లంఘనులకు పెనాల్టీలు వేసే బాధ్యత పోలీసుశాఖకు అప్పగించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు. అయితే జీహెచ్ఎంసీలో స్వచ్ఛ సర్వేక్షన్, అభివృద్ధి పనులు, ఇతర కారణాలతో ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతను పోలీసుశాఖకు అప్పగించారు. అయితే నిబంధనలు ఉల్లంఘించడం, కరోనా పాజిటివ్ వచ్చినా ఐసోలేషన్లోలేకుండ బయటి తిరగడం వంటి వాళ్లకు సంబంధించిన రిపోర్ట్‌ను పోలీసుశాఖకు జీహెచ్ఎంసీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పోలీసు శాఖ చర్యలు తీసుకునేవిధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. ముఖ్యంగా మాస్కులేకుండా తిరిగితే పెనాల్టీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు.
కంటైన్మెంట్ జోన్లపై..
కరోనా కేసులు పెరుగుతుండడంతో జీహెచ్ఎంసీ పరిధిలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతుంది. కంటైన్మెంట్ జోన్ అంటే ఆ ఏరియాలో లాక్డౌన్ విధించాల్సిందే. కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, బ్యాంకు, ప్రయివేటు ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయాలకు వెళ్లాల్సివస్తోంది. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా లక్షలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వేలాది మంది ఉద్యోగాలు పోయాయి. అలాంటి పరిస్థితి మరోసారి రావద్దనే భావనలో సర్కార్ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.అయితే కరోనా నివారణ, ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరించాలని సర్కార్ భావిస్తోంది.
గతవారం రోజుల్లో కేసులు ఇలా..
తేదీ కేసులు
24 138
25 157
26 142
27 154
28 146
29 145
30 184