Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుడిని అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు
నవతెలంగాణ-హయత్‌నగర్
నకిలీ పేర్లు, ఐడీలతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను తెరిచిన పోకిరీ రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేసి అమ్మాయిలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో పోకిరీ ఆగడాలకు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు చెక్‌పెట్టారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు సెల్‌ఫోన్‌తోపాటు రెండు సిమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు సిద్ధిపేట్ జిల్లా దుద్దెడ గ్రామానికి చెందిన మహ్మద్ కరీం ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసిన నిందితుడు అందులో అమ్మాయిలు, మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారిని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే తరహాలో నగరానికి చెందిన ఓ మహిళ ప్రొఫైల్‌ను చూసిన నిందితుడు ఆ ఫోటోను స్క్రీన్‌షాట్ తీశాడు. ఆమె వాట్సాప్‌కు పంపించాడు. అంతటితో ఆగకుండా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో బాధితురాలి ఫోటోలు, వీడియోలను సంపాదించాడు. వాటిని మార్ఫింగ్ చేసిన నిందితుడు తాను చెప్పినట్టు వినాలంటూ బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. ఒంటరిగా తనను కలవాలంటూ బాధితురాలిని ఒత్తిచేయడంతో అందుకు ఆమె నిరాకరించడంతోపాటు ఫోన్‌నెంబర్‌ను బ్లాక్ చేసింది. అయినా వదలకుండా వెంటబడుతున్న నిందితుడు సుదురు మహిళకు పెండ్లయిందని తెలుసుకున్నాడు. దాంతో కక్షపెంచుకుని బాధితురాలి భర్తను సైతం వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దుబారుకి చెందిన వాడిగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ (నకిలీ) అకౌంట్ తెరిచిన నిందితుడు మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలను భార్యాభర్తలకు పంపించాడు. అయితే వారు పట్టించుకోక పోవడంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు వాటిని యూటూబ్‌లో అప్లోడ్ చేసి వాటి లింక్‌లను వారికి పంపించాడు. అయితే రోజురోజుకు వేధింపులు అధికంకావడంతో బాధితులు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు సంప్రదించారు. అడిషనల్ డీసీపీ డి.శ్రీనివాస్ ఆదేశాలతో, ఏసీపీ హరినాథ్ సూచనలతో సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.రాము విచారణ చేపట్టారు. అన్నికోణాల్లో విచారించిన ఇన్స్పెక్టర్ పక్కాగా సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడిని అరెస్టు చేశారు. ఛాకచక్యంగా కేసును ఛేదిండచంతో సీపీ ప్రత్యేకంగా సీఐని అభినందించారు.