Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్/ఓయూ
ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్ల ఆవేదనతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడా సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. శుక్రవారం ఉదయం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సునీల్ మతి చెందడంతో గాంధీ హాస్పిటల్ మార్చురీ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కి తరలించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ మాట్లాడుతూ సునీల్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే 50లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయకపోగా ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 61 ఏండ్లకు పెంచడంతో నిరుద్యోగులు ఉద్యోగాలు రావని నిరాశ నిస్పహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అన్నారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయినవారిలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి శ్రీమాన్, రాజశేఖర్, రవి కుమార్ తదితరులు ఉన్నారు.
ఓయూలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
బోడ సునీల్ నాయక్ మరణాన్ని కేసీఆర్ చేసిన హత్యగా భావిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ చనిపోయిన బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేవిధంగా ప్రజలు తీర్పునివ్వాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు స్వరాష్ట్రం కోసం, నేడు నోటిఫికేషన్స్ జారీ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యార్థులు బతికిపోరాటం చేసి ఉద్యోగాలు సాధించుకోవాలి తప్పా ఇలా ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చడం తగదన్నారు. కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థి నేతలు కృష్ణ మాదిగ, స్వామి గౌడ్, దత్తాత్రేయ, నాగరాజు గౌడ్, బద్రి, విద్యార్థులు పాల్గొన్నారు.