Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాల సేకరణ పూర్తి
- మొత్తం 43 మంది టీచర్లు, 132 ఆయాల భర్తీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లా పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అయిదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వివరాలు సేకరించారు. అందుకు సంబంధించిన నివేదికను సైతం సిద్ధం చేసి.. జిల్లా కలెక్టర్కు ఆమోదానికి పంపించారు. కలెక్టర్ ఆమోదం లభించిన వెంటనే మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఆమోదం కోసం పంపించారు. కమిషనర్ ఆమోదం తరువాయి.. వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
జిల్లా పరిధిలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) కింద అయిదు ప్రాజెక్టులున్నాయి. జిల్లాలోని చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్లోని ఆయా ప్రాజెక్టుల పరిధిలో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 912 ఉండగా.. మినీ కేంద్రాలు రెండు ఉన్నాయి. ప్రస్తుతం వీటీలో 870 మంది టీచర్లతో పాటు ఒక మినీ టీచర్ పనిచేస్తుండగా.. 780 మంది ఆయాలు పనిచేస్తున్నారు. దీంతో 42మంది టీచర్లతో పాటు ఒక మినీ టీచర్ పోస్టుతో పాటు 132 మంది ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేండ్ల కింద జిల్లా కలెక్టర్ ఆమోదంతో అయిదు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఏర్పడ చోట టీచర్లు, ఆయాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే అంగన్వాడీ టీచర్, ఆయాల పోస్టులకు పదో తరగతి విద్యార్హతగా నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఖాళీ పోస్టుల భర్తీతో కేంద్రాల నిర్వహణ మెరుగుపడి పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 1నుంచి ఆరేండ్లలోపు వయసు ఉన్న చిన్నారులు 1,00,053 మంది ఉన్నారు. పదివేలకుపైగా గర్భిణీలు, బాలింతలు ఉన్నారు..
అనుమతి రాగానే భర్తీ ప్రక్రియ చేపడుతాం : జిల్లా సంక్షేమాధికారి అకేశ్వర రావు
అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు ఉన్నతాధికారులకు నివేదించాం. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆమోదముద్ర కూడా పడింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి అనుమతి రాగానే భర్తీ ప్రక్రియ చేపడుతాం. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తాం.