Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు నెలల్లో 49 మందిపై పీడీయాక్ట్ నమోదు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరుడు గట్టిన నేరగాళ్లు... స్మగ్లర్లు పోలీసులకు చిక్కి జైలుకెళ్లారో లేదో చిటికెలో బయటకు రావడం, వచ్చాక మరో నేరానికి పాల్పడడం షరామామూలైంది. ఈ కారణంగా నేరాలను అదపుచేయడం పోలీసులకు తలకు మించిన భారమైంది. క్రైం రేటు తగ్గించడంతోపాటు నేరగాళ్ల దూకుడుకు ముకుతాడు వేసేందుకు పోలీసులు పీడీ (ప్రివెంటీవ్ డిటెన్న్షన్ ఆర్డర్) యాక్టును ప్రయోగిస్తున్నారు. వరసగా నేరాలకు పాల్పడుతున్న వారితోపాటు మాదక ద్రవ్యాలు, గంజాయి స్మగ్లర్లు, వైట్‌కాలర్ నేరగాళ్లు, రౌడీ షీటర్లుతోపాటు ఘరానా నేరస్థులపై పీడీ యాక్టు ప్రయోగిస్తున్నారు. జైలుకెెళ్లిళ్లు ఇక ఏడాదిపాటు బయటకు రాకుండా చేస్తున్నారు. దాంతో నేరాలు తగ్గుముఖం పట్టడంతో పాటు, మరో నేరం చేయకముందే నేరస్థులకు శిక్షలు పడే అవకాశముంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 3 వరకు 49 మందిపై పీడీ యాక్టు నమోదు చేశారు. దోపిడీ దొంగలు, వైట్‌కాలర్ నేరస్థులు, భూ కబ్జాదారులు, రౌడీ షీటర్లపై పీడీ యాక్టు నమోదు చేశారు.
కంప్యూటర్లో నేరస్థుల వివరాలు :
హైదరాబాద్ సిటీలో నేరస్థులు జైలు నుంచి బయటకు రాకుండా చేస్తే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందన్న ఆలోచనకు వచ్చిన నగర పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నేరగాళ్లను పట్టుకున్న సమయంలోనే వారి పూర్తి వివరాలు సేకరించి కంప్యూటర్లో భద్రపరుస్తున్నారు. ఇక జైలుకెళ్లిన నిందితులు బయటకు రాకముందే ఇతర కేసుల్లో సాక్ష్యాలు సేకరించి కేసులను ట్రయల్‌కు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా 63 పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. ఘరానా నేరస్థులు పీడీ యాక్టు ఉన్న నేరగాళ్ల వివరాలను క్షేత్రస్థాయిలో సిబ్బందికి అందించారు. ముఖ్యంగా వరుస నేరాలకు పాల్పడుతున్న వారిపై అధిక దృష్టి పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఘరానా నేరస్థుల వివరాలు అవసరమైతే డైరీలో నమోదు చేసుకోవాలని సూచించారు.
నేరగాళ్లలో భయం :
ఒక్కసారి జైలుకెళ్లిన వాడు 5 నుంచి 10 సంవత్సరాలు శిక్ష పడుతుందని నేరస్థులు గుర్తిస్తే వారిలో భయం పుడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ, యూపీ, బీహార్, కర్నాటక, మహారాష్ట్రతోపాటు తదితర రాష్ట్రాల నుంచి వస్తున్న అంతర్రాష్ట్ర నేరగాళ్లుఇక్కడ నేరాలకు పాల్పడుతున్నారు. ఒకనేరంలో పట్టుబడిన వారి ట్రయల్ పూర్తి చేయడంతోపాటు నిందితులపై ఉన్న మిగతా నేరాల్లో శిక్షలు పడే విధంగా చేస్తే నేరస్థుల్లో భయం పుడుతుందని అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలల కాలంలో 12 మంది ఘరానా నేరస్థులకు జైలు శిక్షలు పడ్డాయి. వారిలో ఐదేండ్ల వరకు జైలు శిక్షలు పడ్డాయి. నల్లకుంట, ఓయూ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన పలు నేరసంబంధిత కేసుల్లో నిందితులకు 20 ఏండ్ల వకు జైలు శిక్షను కోర్టు విధించింది.