Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ యంత్రాంగం
- ఇబ్బందులు పడుతున్న చర్లపల్లి, కాప్రా, ఏఎస్ రావు నగర్ డివిజన్ల ప్రజలు
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి, కాప్రా, ఏఎస్ రావు నగర్ డివిజన్ల పరిధిలో గేటెడ్ కమ్యూనిటీల పేరుతో రోడ్లకు అడ్డంగా గేట్లు పెట్టి అప్రోచ్ రోడ్లను దర్జాగా కబ్జా చేస్తున్నారు. అమూల్య హోమ్స్ రోడ్లకు అడ్డంగా పెట్టిన గేట్లతో చర్లపల్లి డివిజన్ పరిధిలోని అనేక కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు, వాహనదారులు, పాదచారులు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. జీహెచ్ఎంసి ఉన్నతాధికారుల ఆదేశాలను పెడచెవిన పెడుతూ గేటెడ్ కమ్యూనిటీల పేరుతో అప్రోచ్ రోడ్లను దర్జాగా కబ్జా చేసిన కాప్రా సర్కిల్ అధికారులు వంత పాడటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్ళ కాలంగా కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా వాసవి, శివ నగర్, న్యూ వాసవి, శివ నగర్ నుంచి జమ్మిగడ్డ వైపు వెళ్లే అప్రోచ్ రోడ్డును అమూల్య హోమ్స్ బిల్డర్స్ గేటెడ్ కమ్యూనిటీ పేరుతో రోడ్లను దర్జాగా కబ్జా చేసి భారీ గేట్లను ఏర్పాటు చేసుకున్నారు. రివైజ్డ్ ప్లాన్‌కు సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ కోసం ఏప్రిల్ 30, 2016న అమూల్య హోమ్స్ యాజమాన్యం దరఖాస్తు చేసుకోగా జీహెచ్ఎంసి చీఫ్ సిటీ ప్లానర్ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన తరువాత అట్టి దరఖాస్తును రిజెక్ట్ చేయడం జరిగింది. చీఫ్ సిటీ ప్లానర్ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సమయంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అమూల్య హోమ్స్‌కు రెండువైపులా ఉన్న 12 మీటర్లు, 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లకు భారీ గేట్లు ఏర్పాటు చేయడం చూశారు. దక్షిణవైపున 25 ఫీట్లు వెడల్పు గల రోడ్డుపైన అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడ కనిపించింది. ముందుగా అనుమతి మంజూరు చేసిన ప్లానుకు మున్సిపల్ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ప్రజా అవసరాలకు ఉపయోగపడే రోడ్లను కబ్జా చేసినట్లు భావించాల్సి ఉంటుందని చీఫ్ సిటీ ప్లానర్ రాతపూర్వకంగా స్పష్టం చేయడం జరిగింది. ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ పరిధిలోని భవాని నగర్లో ఇదే తంతు
డివిజన్ పరిధిలోని భవాని నగర్లో రోడ్లకు అడ్డంగా పెట్టిన గేట్లతో వాహనదారులు, పాదచారులు అష్టక ష్టాలు పడుతున్నారు. కరోనా కట్టడి పేరుతో ఏడాది కాలంగా మూసివేసిన గేట్లతో భవాని నగర్ కాలనీ వాసులే కాకుండా పరిసర కాలనీలకు చెందిన అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులకు చీమ కుట్టినట్టైనా లేకపోవడం దురదష్ట కరమని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమూల్య హోమ్స్, భవాని నగర్‌లతో పాటు, ఏఎస్ రావు నగర్ ప్రధాన రహదారి అనుకొని రోడ్లను దర్జాగా ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న గేట్లను, శాశ్వత-తాత్కాలిక నిర్మాణాలను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చర్లపల్లి,ఏ ఎస్ రావు నగర్ డివిజన్ల కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డిలు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్లను కాప్రా కాలనీల కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్ష-కార్యదర్శులు సంజీవరెడ్డి, మధుకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రామా చార్యులు, చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధులు ఎంపల్లి పద్మారెడ్డి, చంద్రశేఖర్, గగన్ కుమార్ తదితరులు కోరుతున్నారు.