Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశానికి పట్టుగొమ్మలుగా ఉన్న రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ ఎన్ఎల్, విద్యుత్ లాంటి సంస్థలను అంబానీ, అదానీ లాంటి దోపిడీదారుల చేతుల్లో పెడుతున్న బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను కార్మికుల్లో ప్రచారం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదివారం సంతోష్‌నగర్‌లోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో 'కార్మికోద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు- పోరాటాల ఆవశ్యకత' అనే అంశంపై జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు కె.జంగయ్య అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. స్వదేశీ నినాదం, ప్రజల్లో అభద్రతను తరమివేస్తామంటూ నమ్మబలికి రెెండోసారి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 73 ఏండ్లుగా అణగారిన వర్గాలకు అంతో ఇంత రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి రైల్వే, బీఎస్ఎన్ఎల్, విద్యుత్, విమానాయానం, ఎల్ఐసీ, బ్యాంకులు, రక్షణ రంగం, నౌకయానం, విశాఖ ఉక్కు, బొగ్గుగనుల్లాంటి వాటిన్నింటిని ప్రయివేటీకరిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 70శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డ ఈ దేశంలోని రైతాంగానికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి పరోక్షంగా దేశప్రజలందరినీ అభద్ర తలోకి నెట్టివేశారన్నారు. ఈ పరిణామాలను ఓల్డ్‌సిటీలోని వివిధ రంగాల కార్మికుల్లో విస్తృత అవగాహన కల్పించి, మేడే స్ఫూర్తితో పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్టు వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ కార్యదర్శి పి.నాగేశ్వర్. ఎస్.కిషన్, సోమానాయక్, భషీర్, గోపి, తదితరులు పాల్గొన్నారు.