Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలోని రజక, నాయీ బ్రాహ్మణులకు సంబంధిం చిన సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రజక వృత్తిదారులు సంఘం స్వాగతించింది. సోమవారం హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తాలోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ లాండ్రీలు, దోబీ ఘాట్లకు రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్లు వరకు ఉచిత కరెంట్ అందిస్తామని జీవో 2ను విడుదల చేయడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా వృత్తులను ఆధునీకరించాలని, రైతులకు మాదిరిగా రజకులకు ఉచిత కరెంటు ఇవ్వాలని పలుమార్లు కోరితే ఇప్పటికైనా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. వీటితోపాటు మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని, జీవో 190 ప్రకారం లక్షమంది రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు. వారందరికీ రూ. రెండు లక్షల వరకు రుణాలు అందించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల వృత్తి కాంట్రాక్టు రజకులకు ఇవ్వాలన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో దోబీఘాట్ల నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 50 ఏండ్లు నిండిన రజకులకు వృద్ధాప్య పెన్షన్, అనారోగ్యానికి గురయ్యే వారికి ఆరోగ్య బీమా వర్తింపజేయాలన్నారు. ఈ సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నరేష్, నగర నాయకులు సింహాచలం, రామ్మూర్తి, వీరబాబు, గణేష్, వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.