Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్(సాట్స్)లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కోచ్‌లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సీపీఐ(ఎం) నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 28 ఏండ్లుగా వివిధ క్రీడలకు కోచ్‌లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రంలో కేవలం 120మంది కోచ్‌లు మాత్రమే ఉండగా అందులో నలుగురు మాత్రమే పర్మినెంట్ అని, మిగతా వారంతా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. మూడేండ్లలో పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు మెడల్స్ సాధించిన క్రీడాకారులకు భారీగా నజరానాలు ప్రకటిస్తున్న సర్కారు, వారిని తయారు చేసిన కోచ్‌లను అభద్రతకు గురి చేయడం అన్యాయమని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కోచ్‌లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సీపీఐ(ఎం) తరపున ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క్రీడారంగం అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నదని, సరిపడా కోచ్‌లు, నిధులు లేవని గుర్తుచేశారు. పే అండ్ ప్లే పద్దతిలో క్రీడాకారుల నుంచి ఫీజులు వసూలు చేసుకుని నడుపుకోండనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, క్రీడా వ్యవస్థలు అవినీతితో భ్రష్టుపట్టి పోతున్నాయని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా రంగం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని, శాశ్వత కోచ్‌లను అవసరమైన సంఖ్యలో నియామకాలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.