Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లో కాలంచెల్లిన హల్దీరామ్స్ ప్రొడక్ట్స్
- 18 రకాల ప్రొడక్ట్స్‌తోపాటు ఆటో, కెమికల్స్ స్వాధీనం
- ప్రత్యేక నిఘా వేశాం: జాయింట్ సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హల్దీరామ్స్ కంపెనీ సరఫరా చేసే చుడ్వా, సోన్ పాపడ్, మిక్చర్, బాదామ్ తదితర తినుబండారాలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటోంది. ప్రముఖ కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్‌తో సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో అయిపోయిన ఎక్స్పైరీ డేట్‌ను మార్చి, కాలం చెల్లిన వాటిని మార్కెట్లో సరఫరా చేస్తున్న నిందితుడిని లంగర్‌హౌజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 1,50,000 విలువగల హల్దీరామ్ ప్రొడెక్ట్స్తోపాటు ఆటో, రబ్బర్స్టాంప్స్, తదితర వస్తువులను సీజ్ చేశారు. సోమవారం వెస్టుజోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లంగర్‌హౌజ్ అడిషనల్ ఇన్స్పెక్టర్తో కలిసి జాయింట్ సీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. లంగర్‌హౌజ్ బాపూనగర్‌కు చెందిన కోమటి లక్ష్మీనారాయణ పదేండ్లుగా హల్దీరామ్ సంస్థకు సబ్ డీలర్‌గా వ్యవహరిస్తున్నాడు. 'జై శ్రీ రామ్' పేరుతో ఏజెన్సీని నడిపిస్తున్న నిందితుడు స్థానికంగా గోదాంను ఏర్పాటు చేసుకున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో కాలం చెల్లిన హల్దీరామ్స్ ప్రొడక్ట్స్‌ను సేకరించి గోదాంలో భద్రపరుస్తున్నాడు. వాటిపై వున్న తయారీ తేదీలను(ఎక్స్పైరీ డేట్స్) కెమికల్స్‌తో తొలగిస్తున్న నిందితుడు తాజా తేదీలను ముద్రిస్తున్నాడు. రెండేండ్ల క్రితం ఎక్స్పైరీ అయిన వాటిని కూడా ఈ నెలలో తయారు చేసినట్టుగా తేదీలను మార్చాడు. వాటిని యథావిధిగా మార్కెట్లో సప్లరు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న లంగర్‌హౌజ్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ఎల్.భాస్కర్‌రెడ్డి ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక నిఘా వేశారు. పక్కాసమాచారంతో గోదాంపై దాడులు నిర్వహించి నిందితుడిని అరెస్టు చేశారు. ఎక్స్పైరీ వస్తువులను సరఫరా చేయడం నేరమని జాయింట్ సీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న ప్రొడక్ట్స్‌లో కొన్ని స్వీట్స్‌కు ఫంగస్ వచ్చిందన్నారు. చిన్నపిల్లలు వాటిని తీసుకుంటే ఆరోగ్యసమస్యలు తలెత్తడమేగాక, కొన్ని సార్లు ప్రాణాలకు ముప్పుఏర్పడే అవకాశముందన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, దుకాణ దారులు కాలం చెల్లిన వస్తువులను విక్రయించ రాదని హెచ్చరించారు. నిందితుడు ఎక్స్పైరీ అయిన వస్తువులను గోదాంకు తరలించి అక్కడ వస్తువులపై ఉన్న ఎక్స్పైరీ డేట్లను ఏరేజర్, తిన్నర్తో తొలిగించి తాజా డేట్స్‌ను ముద్రిస్తున్నాడని స్పష్టం చేశారు. చాకచక్యంగా కేసును ఛేదించడంతో అడిషనల్ ఇన్స్పెక్టర్తోపాటు ఎస్ఐ పి.వెంకటేశ్వర్లును, తదితరులను జాయింట్ సీపీ ప్రత్యకంగా అభినందించారు.