Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవాజ్ తెలంగాణ స్టేట్ కమిటీ డిమాండ్
నవతెలంగాణ-నారాయణగూడ
టీఆర్టీ-2017లో మిగిలిన 530 ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 22(2-హెచ్) ప్రకారం అందుబాటులో ఉన్న మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని అవాజ్ తెలంగాణ స్టేట్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ మొయిజోద్దీన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈమేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ కార్యదర్శి షేక్ ఫారుఖ్ అలీ, ఉపాధ్యక్షులు అహ్మద్ సండ్కే, ప్రధాన కార్యదర్శి అబ్బాస్ అలీలతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీఆర్టీ 2017 నిర్వహించి, అందులో 900 మంది ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. కానీ 370 మందిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించి మిగిలిన ఉపాధ్యాయ పోస్టులు గత 3 సంవత్సరాలుగా భారీగా ఉంటున్నాయన్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న వాటిలో సగానికి పైగా ఉపాధ్యాయ పోస్టులు నియామకం జరగలేదన్నారు. దీంతో ఉర్దూ మీడియం చదువుతున్న పిల్లలకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కలుగజేసుకుని 530 ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ ట్రెయిన్డ్ టీచర్స్ అసోసియేషన్ నేతలు ఎండీ.గౌస్, మోయిజ్, ఫర్జానా, తదితరులు పాల్గొన్నారు.