Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతీ జోన్‌కు ఒక సీఈ పర్యవేక్షణ
- మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
- జీహెచ్ఎంసీలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో నాలా పూడికతీత, విస్తరణ, ఆక్రమణల తొలగింపు పనులను మరింత వేగవంతంగా చేసేందుకు ప్రతీ జోన్‌కు ఒక చీఫ్ ఇంజినీర్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృóద్ధి కార్యక్రమాలపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా నగరంలో శానిటేషన్, రహదారుల అభివృద్ధి, నాలా విస్తరణ కార్యక్రమాలపై నిర్వహించిన ఈ సమావేశానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీమేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్. జీహెచ్ఎంసీ, జలమండలి తదితర విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. సాధ్యమైనంత మేరకు అదనపు యంత్రాలు, మానవ వనరులను ఉపయోగించి పూడిక పనులను సైతం పూర్తి చేయాలని ఆదేశించారు. పూడిక తీత పనులు అత్యంత ప్రాధాన్యతగల పనుల్లో చేర్చాలన్నారు. ప్రత్యేకంగా గ్రీన్ చానెల్‌ను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. నగర అభివృద్ధి, సామాన్య ప్రజానీకం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాలాలలోని ఆక్రమణలను, అడ్డంకులను తొలగించాలని, అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపులో నిరాశ్రయులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే కేటాయించాలని ఆదేశించారు. నగరంలో లింక్ రోడ్ల నిర్మాణం, సీఆర్ఎంపీ పనుల పురోగతి ముమ్మరంగా సాగుతుందని అన్నారు. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టులకు భూ సేకరణకు రూ. 2,800 కోట్ల విలువైన టీ.డీ.ఆర్ లను అందచేయడం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఈ విషయమై కమిషనర్ లోకేశ్ కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి లను మంత్రి అభినందించారు. మౌలిక సదుపాయాల కల్పన, వినూత్న కార్యక్రమాల అమలులో హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాల కన్నా ముందంజలో ఉందని, దీనిలో భాగంగా ఎస్.ఆర్.డి.పి కార్యక్రమంలో చేపట్టిన దాదాపు 21 ప్రాజెక్టులు నగర వాసులకు అందుబాటులో వచ్చాయని, మరో 17 ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తికానున్నాయని వెల్లడించారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మరింత శ్రద్ధ చూపించాలని, జోనల్ కమిషనర్లు ప్రతీ రోజూ ఉదయం వేళలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సర్కిళ్ల వారీగా శానిటేషన్ కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. ప్రతీ సర్కిల్లో ఎన్ని నివాసాలున్నాయి, శానిటేషన్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఇంటింటి నుండి చెత్త సేకరణకు ఎన్ని స్వచ్ఛ ఆటోలున్నాయి, అదనంగా ఎన్ని కావాలో ఆడిట్ నిర్వహించాలన్నారు. నగర పౌరుల సదుపాయాలకోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు.