Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా ప్రతిపాదనలు రూపొందించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అనుసరించాల్సిన కార్యాచరణపై మంగళవారం కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్లో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధి, సీవరేజ్ డ్రెయినేజీ, నాలాల మరమ్మత్తు, వరద నీరు, ముంపు, ట్రాఫిక్ వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. 2050 వరకు జనాభా పెరుగుదల అవసరాలు అంచనా వేస్తూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. నగర శివారు ప్రాంతాలు అన్ని రంగాల్లో మరింత అభివృద్థి చెందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రూ.3వేల కోట్లు కేటాయించడం హర్షదాయకమన్నారు. సమావేశంలో జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ మాట్లాడుతూ జగద్గిరిగుట్టలో చివరి బస్టాప్‌లో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, అజ్బెస్టాస్ కమాన్ నుంచి జగద్గిరిగుట్ట వరకు రోడ్డు వెడల్పు చేపట్టి డివైడర్లు ఏర్పాటు, డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మేయర్, చైర్మెన్లు, కార్పొరేటర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.