Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెయింట్ పాల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ ఆందోళన
నవతెలంగాణ-అడిక్‌మెట్
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్, గడ్డం శ్యామ్ డిమాండ్ చేశారు. ఫీజుల దోపిడీ ఆపాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మంగళవారం సెయింట్ పాల్స్ స్కూల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్కర కాలంలో విద్యార్థి, తల్లిదండ్రుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజ్ మాత్రమే తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు వసూళ్లు చేయడం దారుణమన్నారు. ఫీజు మొత్తం కట్టకుంటే పై క్లాస్‌లకు విద్యార్థులను ప్రమోట్ చేయం, పరీక్షలు నిర్వహించం, ఆన్లైన్ క్లాస్‌ల లింక్ కూడా కట్ చేసి టీసీ ఇస్తాం అని తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. కరోనా పరిస్థితుల ప్రభావంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఏ మాత్రం కనికరం లేకుండా వ్యహరిస్తున్నారాని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలోఅభి, గౌతమ్, తల్లిదండ్రులు అంజి, భాస్కర్, సుభాష్, మమత, మీనా, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.