Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఎల్బీనగర్
గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయం పరిధిలో నవంబర్ నెలలో రిక్రూట్ చేసుకున్న సుమారు 500 మంది మున్సిపల్ కార్మికులకు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదన్నారు. కాంట్రాక్టు ముగిసింది మీకు ఉద్యోగం లేదు వెళ్లి పోవాలి అంటూ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కార్మికుల శ్రమ దోపిడీ చేయడం దుర్మార్గపు చర్య అని, వారిని విధుల్లో కొనసాగించి, జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఉప్పల్ కన్వీనర్ శ్రీనివాస్, ఎల్బీనగర్ సర్కిల్ సీఐటీయూ సెక్రటరీ అలేటి ఎల్లయ్య, కాప్రా సర్కిల్ కన్వీనర్ ఉన్ని కృష్ణన్, నాయకులు వీరయ్య, వెంకటరెడ్డి, కె. మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.