Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్‌మీడియాలో మంత్రి మల్లారెడ్డి ఆడియో వైరల్
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వెంచర్ విషయంలో మల్లారెడ్డి రియల్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన ఆడియో ప్రస్తుతం కలకలం రేపుతుంది. 'వెంచర్ వేసుకున్నావ్.. నాకు మామూళ్లు ఎందుకు ఇవ్వలేదు'అని రియల్టర్‌ని మల్లారెడ్డి ప్రశ్నించాడు. అందుకు రియల్టర్ మాట్లాడుతూ తాను సర్పంచ్‌కు మామూలు ఇచ్చానని సమాధానమిచ్చాడు. దీంతో మల్లారెడ్డి 'సర్పంచ్‌కు మామూళ్లు ఇస్తే సరిపోతుందా ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రి లేరా? డబ్బులిచ్చే వరకు వెంచర్లో పనులు ఆపాలి' అని హుకుం జారీ చేశాడు. గతంలో కూడా మల్లారెడ్డిపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్యామల అనే మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాక రిజిస్ట్రేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలతో ఆయన మీద దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయ్యింది. అయితే మల్లారెడ్డి వ్యవహరంపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మంత్రి మల్లారెడ్డిని ఫోన్లో సంప్రదించగా స్పందించకపోవడం గమనార్హం. దీంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని అన్నట్టు తెలిసింది.