Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు రూ. 10లక్షలకుపైగా ఆస్తినష్టం
నవతెలంగాణ-హైదరాబాద్
అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూసీ ఒడ్డునవున్న టైర్ల గోదాంలో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండ ఉండడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాదాపు 15 ఫైరింజన్లు 3గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆఫ్జల్‌గంజ్ సీఐ రవీందర్‌రెడ్డి, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు వంద అడుగుల దూరంలో భారత్ పెట్రోల్ బంక్ ఉంది. అప్రమత్తమైన అధికారులు మంటలు పెట్రోల్ పంప్వైపు వ్యాపించకుండా నివారించగలిగారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 10లక్షలకుపైగా ఆస్థినష్టం వాటిల్లిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. బుధవారం అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిల్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గోషామహల్ చాక్నావాడికి చెందిన గోవింద్రాజ్, సతీష్రాజ్లు గత కొంతకాలంగా అఫ్జల్‌గంజ్‌లో పాత టైర్లు విక్రయించే దుకాణాన్ని కొనసాగిస్తున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి వాడేసిన టైర్లను కొనుగోలు చేసి వాటిని మూసీఒడ్డున గల ఖాళీ స్థలంలో(గోదాం) నిల్వ చేస్తారు. అనంతరం వాటిని రీగ్రూప్ చేసి విక్రయిస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితమే 3లారీలకుపైగా టైర్లను తీసుకొచ్చి ఇక్కడ నిల్వచేశారు. ఇదిలావుండగా బుధవారం ఉదయం 10:30ల ప్రాంతంలో అక్కడవున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాత వైర్లను పెద్దఎత్తున పోగేసి వాటికి మంటలు అంటించారు. వైర్లు కాలిన తర్వాత వెలువడే రాగిని బయటకు తీసే క్రమంలో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పక్కనే ఉన్న పాత టైర్లకు అంటుకున్నాయి. దాంతో భయాందోళనకు గురైన ఆ వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. మంటలు ఎగిపడుతూ దట్టమైన పోగులు అలుముకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. మంటలు వ్యాపించకుండా ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి సమస్ఫూర్తితో వ్యవహరించారు. ఎస్ఐ రమేష్, సైదులు, బాలస్వామితోపాటు స్థానికంగా ఉండే యువకుల సహాయంతో మంటల్లో కాలుతున్న టైర్లను బయటకు లాగేశారు. ఒకవేళ పెట్రోల్ బంక్ వరకు మంటలు వ్యాపించ వుటే పెను ప్రమాదం సంభవించేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నిరాశ్రయులైన గుడిసెవాసులు
మూసీ ఒడ్డున గత కొంతకాలంగా యాచకులు రోడ్లపై పడిన చిత్తుకాగితాలను, ప్లాస్టిక్ డబ్బాలను పోగు చేసుకుని వాటిని విక్రయించి వచ్చేడబ్బులతో అక్కడే గుడిసెలో నివాసముంటున్నారు. దాదాపు 50 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి. అయితే బుధవాం జరిగిన అగ్నిప్రమాదంతో 10 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఆ గుడిసె వాసులు తాము కష్టపడి సంపాదించిన సొమ్ము, సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని అక్కడి వచ్చిన వారిని వేడుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ప్రాథేయపడ్డారు. రంగమ్మ అనే మహిళ తనకు చెందిన రెండు రక్షాలు, గుడిసెలోని రూ.10వేల నగదు, వెండి పట్టగొలుసులు, వస్తువులు కాలీ బూడిదయ్యాయని కన్నీరుమున్నీరైంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది.
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఆ ప్రాంతంలో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అఫ్జల్‌గంజ్ నుంచి సీబీఎస్ వైపు వెళ్లే రహదారిలో గంటల తరబడి ట్రాఫిక్ నిల్చిపోవడంతో ఎంతో శ్రమపడిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.