Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాపోలు రాములు
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్ర కార్మిక మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి పార్టీని కాపాడాలని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు రాములు డిమాండ్ చేశారు. బుధవారం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లారెడ్డి గతంలో అనేకసార్లు అవకతవకలకు పాల్పడిన సంఘటనలు గుర్తు చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్ల టిక్కెట్లు అమ్ముకుని పార్టీ పరువు బజారు పాలు చేశారని ఆరోపించారు. దుండిగల్ పోలీసు స్టేషను పరిధిలో ఒక మహిళ తన భూమిని మల్లారెడ్డి కబ్జాచేశాడని కేసు పెట్టిందని, అయితే అధికారాన్ని ఉపయోగించుకొని కేసు లేకుండా చేసుకున్నారని తెలిపారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఒక సామాన్యుడు నీటి సమస్యపై అడిగితే పోలీసు కేసు పెట్టిస్తానని బెదిరింపులకు గురి చేశారని, తాజాగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారులను వాటా కోసం దమ్కీలు ఇచ్చిన సంగతి వెలుగులోకి వచ్చిందన్నారు. ఈసంఘటనలపై అధిష్టానం స్పందించి మల్లారెడ్డి వ్యవహార శైలిపై విచారణ జరపాలని, తక్షణమే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి పార్టీని కాపాడాలని కేసీఆర్, కేటీఆర్‌లను కోరారు.