Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫేస్- 2 పనులు పూర్తి చేయాలి
- సికింద్రాబాద్ రైల్ నిలయంవద్ద వామపక్షాల ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎంఎంటీఎస్ రైళ్లను తక్షణమే పునర్ ప్రారంభించాలని, ఫేస్-2 పనులు తర్వరగా పూర్తి చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినదించారు. సీపీఐ(ఎం) గ్రేటర్హైదరాబాద్ సెంట్రల్ సిటీకమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను గతేడాది మార్చిలో నిలిపి వేశారని గుర్తు చేశారు. బెంగుళూర్, ముంబాయి తదితర రాష్ట్రాలో లోకల్ రైళ్లను తిరిగి ప్రారంభించినా హైదరాబాద్‌లో ఇప్పటీకీ ఎంఎంటీఎస్‌ను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. లోకల్ రైళ్లు లేకపోవడంతో నగర వాసులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. విమాన సర్వీసులు, బస్సులు, మెట్రోరైళ్లను ప్రారంభించిన ప్రభుత్వం ఎంఎంటీఎస్‌ను రైళ్లను ప్రారంభిస్తే వచ్చే నష్టమేమీ లేదన్నారు. త్వరలో ప్రారంభిస్తామని దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ నెల రోజుల క్రితం చెప్పినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడంతోనే ఫేస్-2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయలేదని విమర్శించారు. నిధులు లేకపోవడంతో ఫేస్-2 పనులు నిలిచిపోయాయన్నారు. ఈ పనులు పూర్తయితే దాదాపు లక్షన్నర మంది అదనంగా ప్రయాణించే అవకాశముందన్నారు. రైల్వేట్రాక్స్ నిర్మించకుండానే స్టేషన్ భవనాలకు అధిక నిధులు ఖర్చుచేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్లో సైతం ఎంఎంటీఎస్‌కు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది సామాన్యులు ప్రయాణించే ఎంఎంటీఎస్ రైళ్లను వెంటనే ప్రారంభించాలని, ఫేస్-2 పనులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర నాయకులు ఎం.నర్సింహ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు, అరుణజ్యోతి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు ఎస్ఎల్ పద్మ, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి జావిద్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు జాన్సీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు అనురాధ, ఎంసీపీఐ(యు) నాయకులు తుకారాం, సీపీఐ(ఎం) సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి అజరుబాబు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, బి.రాము తదితరులు పాల్గొన్నారు.