Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు డిప్యూటీ మేయర్ సూచన
- లాలాపేట్ క్రీడా స్టేడియాన్ని సందర్శించిన జోనల్ కమిషనర్, పలు విభాగాల ఆఫీసర్లు
నవతెలంగాణ-ఓయూ
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశంలో మున్సిపల్‌శాఖ మంత్రి సూచనల మేరకు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితోపాటు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ పి.మోహన్‌రెడ్డిలు బుధవారం ఇక్కడి ప్రొఫెసర్ జయ శంకర్ స్టేడియం, హౌసింగ్ బోర్డులోని పార్కు, గణేశ్‌నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌ను సందర్శించారు. కొన్ని పనుల నిర్వహణకు హాజరు కావాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ మేయర్ సూచించారు. స్టేడియం వెనుక భాగంలో చెత్తా చెదారాన్ని తొలగింపజేయాలన్నారు. స్టేడియంలో చేపట్టాల్సిన మరమ్మతు పనులకు ఎస్టిమేషన్స్ ఇవ్వాలని జోనల్ కమిషనర్‌ను, సంబంధిత అధికారులను కోరారు. హౌసింగ్‌బోర్డ్ కాలనీ పార్కును సందర్శించారు. ఇక్కడ లెవలింగ్ చేయాల్సి ఉందని, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని, పిల్లలు ఆడుకునే పరికరాలు వంటివి అమర్చి ఆధునీకరించాలని సూచించారు. గణేశ్ నగర్‌లోని పాత భవనాన్ని, పక్కనే ఉన్న లైన్‌ను కూడా సందర్శించారు, ఇది ఉపయోగంలో లేదని, డిప్యూటీ మేయర్ భవనం దాని పరిసరాలలో శుభ్రం చేయాలని చెప్పారు. కరోనా విజంభిస్తున్న పరిస్థితుల్లో వైద్య సేవలను ఉప యోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్ర సందర్శన నుండి తిరిగి వచ్చేటప్పుడు, డిప్యూటీ మేయర్ వినోభానగర్ను సందర్శించారు. అక్కడ కొన్ని పరిసరాలలో మురుగు నీటి పారుదల మార్గాలు గమనించి, అవసరమైన చోట మ్యాన్‌హోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై మురుగునీరు రాకుండా చూసుకోవాలని హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి అధికారులను ఆదేశించారు. వినోభా కమ్యూనిటీ హాల్‌ను కూడా సందర్శించి, నీటి సౌకర్యం లేదని, పాత బోర్వెల్ ఉందని, బోర్వెల్ పునరుద్ధరించాలని హెచ్‌ఎమ్‌డబ్ల్యుఎస్‌ఎస్‌బి అధికారులకు సూచించారు. జోనల్ కమిషన్ బి.శ్రీనివాస్‌రెడ్డి సాధ్యమైనంత త్వరగా తమకు ఎస్టిమేషన్స్ ఇస్తే నిధులు మంజూరు చేసి రానున్నవేసవి కాలంలోపు పనులకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
స్టేడియం దశ తిరిగేనా ?
ఇక జయశంకర్ స్టేడియానికి గతంలో కూడా జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, నాటి మాజీ డీసీ, ఈఈ సందర్శించారు. రూ. 55 లక్షలకు ఎస్టిమేషన్స్ వేశారు. అయినా సాధారణ మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు తప్ప స్టేడియంలో పూర్తిస్థాయి పనులు చేపట్టలేదు. ఇప్పటికైనా పనులు చేపడతారో, పర్యాటనలతోనే సరిపెడతారో చూడాలి. కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, హార్టికల్చర్ ఆఫీసర్ రాఘవేంద్రరావు, స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌గౌడ్, డీఈ రఘు ఏఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్, డీఈ గీతా కుమారి, ఎఈ వెంకటేష్, టీఆర్ఎస్ నేతలు సునీల్ ముదిరాజ్, వేణుగోపాల్ రెడ్డి, నాగేశ్వరరావుగౌడ్, ఎర్రనాగు, జింకల మల్లేశ్‌లు పాల్గొన్నారు.