Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు నిందితులు అరెస్టు
- 4 తులాల బంగారు ఆభరణాల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
దృష్టి మళ్లించి దోపిడీ చేస్తున్న ముఠాలోని ముగ్గురు మహిళలను అరెస్టు చేసిన శాలీబండా పోలీసులు వారినుంచి 4తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.80వేలుంటుందని తెలిపారు. శుక్రవారం డీసీపీ గజారావు తెలిపిన వివరాల మేరకు మాంగార్ బస్తీకి చెందిన రూపా, తుకారాం గేట్‌కు చెందిన ఉషా, ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన ఉమా ముగ్గురు బంధువులు. పాత నేరస్తులైన వీరు అమాయకులను ఎంచుకుని దృష్టి మళ్లించి వారివద్ద గల బంగారు ఆభరణాలు, పర్సులు, బ్యాగ్‌లతోపాటు విలువైన వస్తువులను తస్కరిస్తున్నారు. ఇదే తరహాలో శాలిబండాలో నివాసముంటున్న సయ్యద్ అనే లెక్చరెర్ను ఈ నెల 3న టార్గెట్ చేశారు. ఆయన వద్దగల పర్సును చూసిన ఈ ముగ్గురు ఓల్డ్ సిటీలో ఆయన ప్రయాణిస్తున్న ఆటోను ఎక్కారు. చాకచక్యంగా పర్సునుకొట్టేశారు. అయితే శాలిబండ టీ జంక్షన్ వద్ద ఆటో దిగిన సయ్యద్ తన వద్దగల పర్సును తస్కరించారని గుర్తించి వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏసీపీ మాహ్మద్ మాజీద్ ఆదేశాలతో ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్ విచారణ చేపట్టారు. దాదాపు 50 సిసి కెమెరాలను పరిశీలించిన సీఐ నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలపై నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయని డీసీపీ తెలిపారు.