Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ, ఇతర రాష్ట్రాల తరహాలో రేషన్ ఇవ్వాలని ఐద్వా, డీవైఎఫ్ఐ డిమాండ్
- 17న తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అర్హులందరికీ కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీలు డిమాండ్ చేశాయి. ఈనెల 17న సికింద్రాబాద్లోని సీఆర్వో ఆఫీస్ వద్ద తలపెట్టిన ధర్నాలో బాధితులందరూ పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. శనివారం ఐద్వా, డీవైఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో ఎస్వీకేలో రౌండ్ టేెబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఆర్.అరుణజ్యోతి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి లక్షలాది మంది కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారని, అందులో కేవలం హైదరాబాద్ పరిధిలోనే 1,70,262 మంది దరఖాస్తు చేసుకోగా 44వేల మందికి మాత్రమే కార్డులు రాగా, 94వేల మంది కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, కార్డుల్లో అవసరమైన మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించాలన్నారు. కేరళ తరహాలో 14 రకాల నిత్యావసర సరుకులను తెల్లరేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. ఏపీ పేరుతో ఉన్న కార్డులను తెలంగాణ పేరుతో పునరుద్ధరిం చాలని డిమాండ్ చేశారు. మనదేశంలో సరియైన పౌష్టికాహారం లభించక మహిళాలు, పిల్లలు రక్తహీనత వంటి సమస్యలతో నేటికీ బాధపడేవారు ఉన్నారని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేవలం బియ్యం పంపిణీతో సరిపెట్టుకుందని విమర్శించారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ముందుకు సాగుతుందని ఆమె గుర్తుచేశారు. ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు కె.నాగలక్ష్మీ మాట్లాడుతూ కరోనాతో ప్రజలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో తక్షణమే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులిచ్చి 14 రకాల నిత్యావసర సరుకులు అందజేసి ఆహార భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ అధ్యక్షులు కె.రమేష్ మాట్లాడుతూ కరోనా, సాంకేతిక పేరుతో వృద్ధులు, మహిళలకు బియ్యం ఇచ్చేందుకు గంటలతరబడి క్యూలో నిలబెడుతున్నారని మండిపడ్డారు. పక్కనున్న ఏపీలో చక్కెర, పప్పులు, నూనె, చింతపండు వంటి వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఏమీ అందించకపోగా ఉన్న కార్డులను తొలగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఉపాధ్యక్షురాలు షబాన, సహాయ కార్యదర్శి భవాని, జిల్లా కమిటీ సభ్యులు స్వరూప, వై.వరలక్ష్మి, అన్నపూర్ణ, నాయకులు ఆర్.ఆశోక్, భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు.