Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచేందుకు సీఎం పలు సంస్కరణలు చేపట్టడంవల్ల ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, సైబరాబాద్ కమిషనర్ సీపీ సజ్జనార్‌లు అన్నారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.3.13 కోట్లతో నిర్మిస్తున్న బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు వారు శంఖుస్థాపన చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఊరగుట్టపై ఉన్న రెండెకరాల స్థలంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులకింద అరబిందో ఫార్మా స్యూటికల్స్ సంస్థ సహకారంతో రూ.3.13 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న బాచుపల్లి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్, అరబిందో ఫార్మా వైస్ చైర్మెన్ నిత్యానందరెడ్డి, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొన్ని సంవత్సరాల నుంచి పురాతన భవనంలో కొనసాగుతున్న పోలీస్ స్టేషన్‌కు కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరం అన్నారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం పోలీస్ శాఖకు అధునాతన వాహనాలు ఇచ్చిందన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ సక్సెస్ అయ్యిందని అన్నారు. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ఎన్నో రాష్ట్రాల డీజీపీలు, ముఖ్యమంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత వినియోగిస్తూ పోలీసులు ముందుకు వెళుతున్నారని, ఎన్నో క్లిష్టమైన కేసులు ఛేదిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్తులో అన్ని సౌకర్యాలతో కూడిన బాచుపల్లి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అరబిందో ఫార్మా స్యూటికల్స్ సంస్థ సహకారం అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ యాదవ్, స్థానిక ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.