Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి సుమలత
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 244 సివిల్ కేసులను పరిష్కరించినట్టు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ సి.సుమలత తెలిపారు. మోటారు వాహన ప్రమాదాలకు సంబంధించిన బాధితులకు రూ.10.66 కోట్ల నష్టపరిహారం అందించినట్టు చెప్పారు. ఇతర సివిల్ కేసులలో రూ.23.35 లక్షలు లబ్ధిదారులకు అందజేసే విధంగా కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టుల్లో జరిగిన లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద క్లెయిమ్‌లు, అప్పుల లావాదేవీలు, ప్రీ లిటిగేషన్ కేసులు, కుటుంబ వివాదాలు మొత్తంగా 244 కేసులను ఆరు బెంచ్‌ల ద్వారా పరిష్కరించినట్టు వివరించారు.
కార్మికులకు రూ.5 లక్షల పరిహారం
ఆల్విన్ కాలనీలోని కేతన్ కంపెనీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు కుడిచేతి బొటనవేలు కోల్పోయిన కార్మికుడు రాందాస్‌కు ఫ్రీ లిటిగేషన్ కేసు ద్వారా పూర్తి పరిష్కారం కింద రూ.5 లక్షల నష్టపరిహారాన్ని కంపెనీ ప్రతినిధుల ద్వారా పరిష్కరించారు. 25వ అదనపు చీఫ్ జడ్జి ప్రతిమ బాధితునికి చెక్ అందజేశారు. 14అదనపు చీఫ్ జడ్జి జె.జీవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన లోక్‌అదాలత్ బెంచ్‌లో గరిష్టంగా 126 మోటార్ ప్రమాద నష్టపరిహార కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా పలు కుటుంబ వివాదాలను పరిష్కరించి ప్రజా న్యాయ పీఠం వేదికగా విడిపోయిన జంటలను కౌన్సిలింగ్ ద్వారా కలిపారు. చీఫ్ జడ్జి సుమలత ఆదేశాల మేరకు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ భౌతిక దూరంతో వర్చువల్ పద్ధతిన ఆన్లైన్ ద్వారా, ప్రత్యక్ష హాజరు ద్వారా కేసులు పరిష్కరించారు. కక్షిదారులకు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు, పండ్లు, ఆహారం, తాగునీటిని అందజేసినట్టు సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి కె.మురళీమోహన్ తెలిపారు. లోక్ అదాలత్‌లో సహకరించిన న్యాయవాదులకు ఉభయ పక్షాలకు కతజ్ఞతలు తెలిపారు.