Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారాన్ని సాధించడానికి త్వరలో పల్లె పల్లెకు బహుజన రాజకీయ చైతన్య రథయాత్రలు నిర్వహించనున్నట్లు బహుజన విద్యార్థి సంఘాలు నేతలు పేర్కొన్నారు. సోమవారం ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో మహనీయుల జయంత్యోత్సవాలలో భాగంగా బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ''భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు''ను నిర్వహించారు. ముఖ్య వక్తలుగా ఈఈఈ మాజీ హెడ్ ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ మురళీదర్శన్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, ప్రొఫెసర్ పంతుకాల శ్రీనివాస్‌లు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సంజరు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లేశం మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థల ను ప్రయివేటు పరం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రొ.ప్రభంజన్ యాదవ్ మాటాడుతూ... భారత రాజ్యాంగమే ఈ దేశ ప్రజలను కలిసిమెలిసి ఉండేలా చేసిందన్నారు. రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని చెరిపివేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. బహుజన విద్యార్థి సంఘాల నాయకుడు నలిగంటి శరత్ మాటాడుతూ... భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే బహుజనులు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరిష్కారం అని అభిప్రాయపడ్డారు. అందుకే బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే బహుజన రాజకీయ చైతన్య రథయాత్రలు మొదలుపెడతామని తెలిపారు. కార్యక్ర మంలో విద్యార్థి సంఘాల నాయకులు పులిగంటి వేణుగోపాల్, కొత్తపల్లి తిరుపతి, నాన్ టీచింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు బోయ కుమార్, శంకరయ్య, నరేష్, మేడి రమణ, శరత్ నాయక్, అంబేద్కర్, సునీల్ శెట్టి, జాన్, తిరుమలేశ్ పాల్గొన్నారు.